Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

భారీ ఎత్తున ఎర్ర‌చంద‌నం సీజ్‌

కడప జిల్లా బద్వేలు అటవీ ప్రాంతంలో 34 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ జి. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో ఆర్ ఐ చిరంజీవులు కు చెందిన ఆర్ ఎస్ ఐ పి.నరేష్ టీమ్ గురువారం నుంచి బద్వేలు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సి.రామాపురం సమీపంలో ఎద్దులబోడు వద్ద రెండు మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వీరు టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. ఆ చుట్టుపక్కల పరిశీలించగా 34 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వారి నుంచి 3 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో సహా స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. వీటి విలువ రూ. 35లక్షలు ఉంటుందని అంచనా వేశారు.