అమిత్ షా ముంబై పర్యటనలో భద్రత లోపం
కేంద్ర హోంమంత్రి అమిషా పర్యటనలో భద్రతా లోపం వెలుగుచూసింది. 32 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి గంటలపాటు కేంద్ర హోమంత్రి అమిత్ షా పర్యటనలో హల్ చల్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలోనే భద్రతా వైఫల్యం తలెత్తడం అనేక విమర్శలకు దారితీస్తోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల పాటు ముంబైలో పర్యటించారు.

ఓ వ్యక్తి హోం మంత్రిత్వ శాఖ ఐడీ కార్డు ధరించి భద్రతా బృందంలో కనిపించాడు. కొన్ని గంటల పాటు అమిత్ షాకు దగ్గర్లోనే తిరుగుతూ కనిపించాడు. అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో అధికారులు వెంటనే ముంబయి పోలీసులకు సమాచారం అందించారు. అతడు మహరాష్ట్ర ధూలేకు చెందిన హేమంత్ పవార్‌గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. గిర్గావ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నిందితుడిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. అమిత్ షా పర్యటనలో ఉండే వారి జాబితాలోనూ, భద్రతా సిబ్బంది బృందంలోనూ ఆ పేరు లేదని పోలీసుల విచారణలో వెల్లడైంది.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఎంపీ పీఏ పేరుతో ఓ నకిలీ ఐడీ కార్డు నిందితుడి వద్ద లభించినట్లు తెలుస్తోంది. ఈవిషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు చాలా సేపు అమిత్ షా వెంట వెళ్లడం స్పష్టంగా సీసీటీవీ ఫుటేజీల్లో కన్పించింది.

రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబై నగరంలోని ప్రధాన గణేష్ పండల్ లాల్బాగ్చా రాజా వద్ద ప్రార్థనలు చేశారు. మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమిత్ షా తొలిసారిగా ముంబై చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ల నివాసాలను కూడా సందర్శించారు.

