News AlertTelangana

ఎయిర్ పోర్టులా తయారుకానున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్

నిత్యం రద్దీగా ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ రూపు మార్చుకోబోతోంది. విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను కేంద్రప్రభుత్వం తీర్చిదిద్దనుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఆధునికీకరణకోసం దాదాపు 600 కోట్ల రూపాయలు కేటాయిస్తోందని పేర్కొన్నారు. సీతాఫల్ మండిలోని రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఆయన మూడు లిఫ్టులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ వంటి ప్రయాణికుల సందడి ఎక్కువ కలిగిన రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల మాదిరిగా వసతులు కల్పించాలని, విశాలంగా, ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్రమోదీ కృతనిశ్చయంతో ఉన్నారని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో మొదటి విడత ఎంఎంటీఎస్ అధికంగా ప్రజాదరణ పొందిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రయాన్, నగర మాజీ మేయర్ బండ కార్తీకా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.