గాజాలో హమాస్ అతిపెద్ద సొరంగం రహస్యాలు బట్టబయలు
ఇజ్రాయెల్‌పై మెరుపుదాడులు చేసిన హమాస్ ఉగ్రవాదులు గాజాను తమ రహస్య కేంద్రంగా వాడుకున్న సంగతి తెలిసిందే. వీటిలో హమాస్ దళాలు వాడిన అతిపెద్ద సొరంగం రహస్యాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కనిపెట్టి దాని రహస్యాన్ని చేధించింది. దానిని స్వాధీనంలోకి తీసుకుంది. నాలుగు కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ సొరంగం దాదాపు కొన్నిచోట్ల 50 మీటర్ల లోతులో కూడా ఉంది. ఇది ఉత్తర గాజా నుండి ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని ఎరెజ్ బోర్డర్ క్రాసింగ్ వరకూ ఉంది. పాలస్తానీయులు కూడా ఈ బోర్డర్ క్రాసింగ్ నుండే వైద్యం, ఉపాధి కోసం ఇజ్రాయెల్‌కు వస్తూంటారు. అయితే ఈ సొరంగం కేవలం ఒకే మార్గంలోనే కాకుండా పలు మార్గాలు, కూడళ్లను కలుపుతూ ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక్కడ విద్యుత్ వ్యవస్థ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల పేలుడు పదార్ధాలు కూడా ఉన్నాయని ఐడీఎఫ్ గుర్తించింది. హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ సోదరుడు మహ్మద్ ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహించినట్లు సమాచారం. దీనిలో ఒక సొరంగంలో అతడు వాహనాన్ని నడుపుతున్న వీడియో కూడా ఐడీఎఫ్ కనిపెట్టింది. ఐడీఎఫ్ మాట్లాడుతూ.. ఇవి సాధారణ సొరంగాలు కావని, ఏకంగా భూగర్భంలో నగరాన్నే నిర్మించారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఐడీఎఫ్ 800 సొరంగాలను గుర్తించి, వాటిలో 500 సొరంగాలు ధ్వంసం చేసింది. వీటిలోకి సముద్రపు నీటిని పంపుతున్నారు.


 
							 
							