Breaking Newshome page sliderHome Page SliderNationalNewsNews AlertTrending Todayviral

గృహ రుణాలు తీసుకునే వారికి ఎస్‌ బీఐ షాక్ !

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎస్‌ బీఐ కస్టమర్లకు షాకిచ్చింది. గృహ రుణాలపై వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. కొత్త రుణ గ్రహీతలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. సవరించిన వడ్డీరేట్లు ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. సమయాన్ని బట్టి ఈ గృహ రుణాల వడ్డీరేట్లలో వ్యత్యాసం ఉంటుంది. అయితే, ఈ రేట్ల గరిష్ఠ పరిమితిని ఇప్పుడు ఎస్‌ బీఐ పెంచేసింది. ఇప్పటివరకు ఈ బ్యాంకులో గృహ రుణ రేట్లు 7.50శాతం నుంచి 8.45శాతంగా ఉండగా.. తాజా నిర్ణయంతో ఇది 7.50శాతం నుంచి 8.70 శాతానికి పెరిగింది. అంటే తక్కువ సిబిల్ స్కోరు ఉండేవారికి ఇకపై అధిక వడ్డీరేట్లకు గృహ రుణాలు అందించనుంది.‘‘సిబిల్‌ స్కోరు, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటు ఆధారంగా విధించే వడ్డీరేట్లలో ఎస్‌ బీఐ మార్పులు చేసింది. గృహ రుణాలపై మార్జిన్‌ పెంచుకునేందుకే వడ్డీరేట్లను పెంచాం. అయితే, ఈ పెంపు కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే. ఇప్పటికే తీసుకున్న గృహరుణాలకు ఇది వర్తించదు’’ అని బ్యాంకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా.. దీనిపై ఎస్‌ బీఐ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. మరోక ప్రభుత్వ రంగ బ్యాంకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా తమ గృహరుణాలపై వడ్డీరేట్లను సవరించింది. గతంలో 7.35శాతం ఉండగా.. ఇప్పుడు దాన్ని 10 బేసిస్‌ పాయింట్లు పెంచి 7.45శాతానికి తీసుకొచ్చింది. ఎస్‌బీఐ నిర్ణయంతో మిగతా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా హోమ్‌ లోన్‌పై వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉంది.