చుక్కలు చూపిస్తున్న సంక్రాంతి ప్రయాణం
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుండి ఏపీలోని ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. పండుగ వేళ ఆర్టీసీ బస్సులు ఎంత పెంచినా రద్దీని తట్టుకోలేకపోతుండడంతో ప్రైవేట్ ట్రావెల్స్ దందా షురూ అయ్యింది. ఇష్టారీతిన టికెట్ ఛార్జులు పెంచి ఒక్కో కుటుంబానికి రూ.10 వేల రూపాయల పైనే అదనపు భారం వేస్తున్నాయి. సాధారణ రోజుల్లో రూ.1000 ఉన్న టికెట్, తాజాగా రూ.4000 పలుకుతోంది. డిమాండ్‌ను బట్టి దండుకోవడమే అన్నట్లు ట్రావెల్స్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, భీమవరం, నర్సాపురం, రాజమండ్రి వంటి ఊర్లకు వెళ్లేందుకు చిరుద్యోగికి నెల జీతం అంతా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

