News Alert

డీఆర్‌డీఓ కొత్త చైర్మన్‌గా సమీర్ కామత్…సతీష్ రెడ్డి కి కీలక బాధ్యతలు

డీఆర్‌డీఓ కొత్త చైర్మన్‌గా సమీర్‌ కామత్‌ను నియామకం అయ్యారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న సతీష్‌ రెడ్డిని మరో అత్యున్నత పదవి ఇచ్చి గౌరవించారు. ఆయనను రక్షణ శాఖ సాంకేతిక సలహాదారుగా కేంద్రం నియమించింది. సతీష్‌రెడ్డి స్థానంలో డీఆర్‌డీఓ కొత్త చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్‌ కామత్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, పరిశోధన, అభివృద్ధి శాఖ కార్యదర్శిగానూ కామత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకూ కామత్ డీఆర్‌డీఓవో లో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. ఆయనకు ప్రమోషన్ ఇచ్చిన డీఆర్‌డీఓ కొత్త చైర్మన్ నియామకం చేశారు. కామత్ ఆరవైఏళ్లు వచ్చే వరకూ లేదా.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ పదవిలో ఉంటారు.


ప్రస్తుతం డీఆర్‌డీఓ చైర్మన్‌గా ఉన్న సతీష్‌రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా ఆత్మకూరు. ఆయన అనంతపురం, హైదరాబాద్‌లోని JNTUలో ఉన్నత చదువులు చదివారు. 1986లో డిఫెన్స్‌ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీలో జాయిన్ అయ్యారు. 2018లో డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా నియామకం అయ్యారు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులపై సతీష్‌రెడ్డికి గట్టి పట్టుంది. ఆయన సారథ్యంలో డీఆర్‌డీఓ అత్యాధునిక మిస్సైళ్లను డెవలప్‌ చేసింది. డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీలో డీఆర్‌డీఓను అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. అగ్ని, పృథ్వీ, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థల కోసం నావిగేషన్, ఏవియానిక్స్ టెక్నాలజీని అభివృద్ధిలో సతీష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. దేశంలోనే అగ్రశేణి రక్షణ శాస్త్రవేత్తగా సతీష్ రెడ్డికి మంచి పేరుంది. బాల్లిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్, యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, ఎయిర్ టు గ్రౌండ్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్ లక్ష్యాలను ఛేదించగల మిస్సైళ్లను సతీష్ రెడ్డి హయాంలోనే డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. డిఫెన్స్ టెక్నాలజీ మీద ఆయనకు గట్టి పట్టు ఉండటాన్ని దృష్టిలో ఉంచుకుని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఆయనను తన సాంకేతిక సలహాదారుగా నియమించుకున్నారు.