బెంగళూరులో సందడిగా సైమా అవార్డు సంబరాలు
సైమా అవార్డ్స్ దశమ వార్షికోత్సవం శని, ఆదివారాలలో బెంగళూరులో అట్టహాసంగా జరిగింది. సౌత్ ఇండియాలోని తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ చిత్రపరిశ్రమలకు చెందిన నటులు, టెక్నీషియన్లకు వారి టాలెంట్ ఆధారంగా ఇచ్చే ప్రతిష్టాత్మక సినీ అవార్డులే ఈ సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ).
ఈ కార్యక్రమానికి దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ఎందరో ప్రముఖులు హాజరయ్యారు. కొందరు నటీనటులు అదిరిపోయే డాన్సులు కూడా చేశారు.

ఇక అవార్డుల విషయానికి వస్తే సైమా 2022 అవార్డులలో ఎక్కువ నామినేషన్లతో పుష్ప సినిమా దుమ్ము రేపింది. 12 విభాగాలలో నామినేట్ అయిన ఈ సినిమా 6 అవార్డులను దక్కించుకుంది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సహాయనటుడు, ఉత్తమ గేయరచయిత విభాగాలలో ఈ సినిమాకు అవార్డులు దక్కాయి.
అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని తగ్గేదేలా అంటూ తనదైన స్టైల్లో ఆకట్టుకున్నాడు. అంతేకాక పుష్ప సినిమాలో పాటలకు డ్యాన్సులు కూడా చేశాడు. ప్రేక్షకులంతా ఒక్కసారిగా ఊగిపోయారు.

తెలుగులో తర్వాత దుమ్మురేపిన చిత్రం ఉప్పెన. ఈ సినిమాకు ఏకంగా 3 అవార్డులు దక్కాయి. ఉత్తమ డెబ్యూ హీరో, హీరోయిన్లుగా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి నిలిచారు. ఉత్తమ డెబ్యూ డైరక్టర్‌గా బుచ్చిబాబుకు కూడా అవార్డు దక్కింది.
అయితే బాలకృష్ణ ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగింది. ఎందుకంటే 10 విభాగాల్లో నామినేట్ అయిన అఖండ మూవీ కేవలం 2 విభాగాల్లో మాత్రమే అవార్డులు అందుకుంది. యూత్ ఐకాన్ విజయదేవరకొండ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి, తనదైన స్పీచ్‌తో అందర్నీ ఆకట్టుకున్నాడు.

