నిజమైన రైతులకే రైతుబంధు..జీవన్ రెడ్డి
తెలంగాణలో నిజమైన రైతులు, సాగుచేసే రైతులు మాత్రమే ఇకపై రైతుబంధు పొందుతారని ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం సమీక్ష నిర్వహించి, ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాలలో రైతుబంధు సొమ్మును జమ చేస్తుందని తెలిపారు. రేచపల్లిలోని ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించిన జీవన్ రెడ్డి, మహిళలతో బస్సుప్రయాణం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లోని తప్పొప్పులను పరిశీలించి, భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వంటి అక్రమంగా రైతుబంధు పొందేవారిని అడ్డుకుంటామన్నారు. వారు వందల ఎకరాలను సాగుభూములుగా చూపించి, రైతుబంధు నిధులు పొందుతున్నారని విమర్శించారు. సాగుభూములకు ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా ఎకరాకు 7, 500 రూపాయల చొప్పున రైతుబంధు నిధులు అందుతాయన్నారు. గత ప్రభుత్వం అక్రమార్కులకు నిధులు దోచిపెట్టి, ఖాళీ ఖజానా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కేవలం ఆరు గ్యారెంటీలే కాకుండా, ప్రభుత్వ పధకాలు అన్నీ సక్రమంగా అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.