Breaking Newshome page sliderHome Page SliderInternational

అమెరికా, ఉక్రెయిన్‌ల ఫైటర్ జెట్లను కూల్చేసిన రష్యా

రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ గగనతల రక్షణలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే అమెరికా తయారీ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక యుద్ధ విమానాన్ని తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు విజయవంతంగా ధ్వంసం చేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనను రష్యా కేవలం సైనిక విజయంగా మాత్రమే కాకుండా, పాశ్చాత్య దేశాల ఆయుధాలపై సాధించిన నైతిక విజయంగా విశ్లేషిస్తోంది.

“పాశ్చాత్య ఆయుధాలు ఎంత ఆధునికమైనవైనా మా రక్షణ వ్యవస్థల ముందు నిలవలేవు” అని మాస్కో ఘాటుగా వ్యాఖ్యానించింది. రష్యా సైనిక అధికారి స్పందిస్తూ, “అమెరికా గర్వంగా చెప్పుకునే F-16లు కూడా మా గగనతలంలోకి వస్తే తప్పకుండా కూల్చివేస్తాం.. యుద్ధ విమానం ఏదైనా నియమాలు ఒక్కటే” అంటూ ఎద్దేవా చేశారు. రష్యా పైలట్లు, మిస్సైల్ యూనిట్లు ఈ అమెరికన్ జెట్‌లను లక్ష్యంగా చేసుకుని సిద్ధంగా ఉన్నాయని రష్యా వార్త కధనాలు మీడియా పేర్కొంటోంది.

ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఈ F-16ను రష్యా వైమానిక దాడులను అడ్డుకోవడానికి వినియోగిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రష్యా ఆధునిక రాడార్, మిస్సైల్ సాంకేతికతతో విమానం నేలకూలినట్లు మాస్కో వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదంలో పైలట్ పరిస్థితి ఏమైందన్న వివరాలు ఇంకా స్పష్టంగా వెలువడలేదు. ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు అధికారికంగా సమాచారం వెల్లడించలేదు.

చాలా కాలంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాను కోరుతూ వచ్చిన F-16లు యుద్ధ దిశను మార్చుతాయని కీవ్ ఆశించింది. తాజా ఘటనతో ఆ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. పాశ్చాత్య దేశాల టెక్నాలజీపై తమ సైన్యానికి పైచేయి ఉందన్న సంకేతాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచానికి పంపినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఘటనతో రష్యా–అమెరికా మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉండగా, ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తున్న దేశాలపై మాస్కో హెచ్చరికలు మరింత కఠినంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.