Breaking NewsHome Page Sliderhome page sliderInternational

రష్యాను కంట్రోల్ చేయాల్సిందే : జెలెన్ స్కీ

రష్యాతో నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధం అత్యంత ప్రమాదకర దశకు చేరిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ మరోసారి హెచ్చరిక జారీ చేశారు. గత నెల నుంచి రోజుకు కనీసం వెయ్యి మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, సోమవారం జరిగిన మీడియా సమావేశంలో జెలెన్ స్కీ మాట్లాడారు. ప్రపంచం దుర్మార్గ పాలకుల నుంచి తనను తాను రక్షించుకోవడంలో విఫలమవుతోందని జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ యుద్ధం ప్రతి రోజు ప్రపంచానికి ఒక హెచ్చరిక లాంటిదని, పిచ్చివాళ్ల నుంచి ప్రపంచం తనను తాను కాపాడుకోలేకపోతున్నదానికి ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచాన్ని రక్షించుకునే అవకాశం మన చేతుల్లోనే ఉందని, రష్యాను తప్పకుండా ఆపాల్సిందేనని ” జెలెన్స్కీ స్పష్టం చేశారు.

జెలెన్స్కీ మాట్లాడుతూ, “డిసెంబర్‌ నుంచి ఇప్పటి వరకు రష్యా రోజుకు కనీసం వెయ్యి మంది సైనికులను కోల్పోతోంది. అయినా యుద్ధాన్ని ముగించకుండా కొనసాగిస్తోంది. ఇది పూర్తిగా వింత పరిస్థితి. ఈ విధ్వంసాన్ని ఆపగలిగేది ఒక్కటే మార్గం. అది యూరప్‌, అమెరికా, మిత్రదేశాల సమష్టి శక్తి” అని అన్నారు. అంతర్జాతీయ సమాజం ఒకటిగా స్పందించకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని జెలెన్స్కీ హెచ్చరించారు.

యుద్ధాన్ని ఎలాగైనా కొనసాగించాలనే పట్టుదలతో రష్యా ఈ స్థాయి నష్టాలను కూడా భరిస్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇది ప్రపంచానికి ఒక పెద్ద హెచ్చరికగా జెలెన్స్కీ అభివర్ణించారు. రష్యాను ఆపాలంటే అమెరికా, యూరప్‌తో పాటు అంతర్జాతీయ భాగస్వాములందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని జెలెన్స్కీ స్పష్టం చేశారు.

ఉక్రెయిన్‌కు సైనికంగా, ఆర్థికంగా మద్దతు ఇస్తున్న దేశాలన్నింటికీ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. “మా ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రతి భాగస్వామికి ధన్యవాదాలు. ఉక్రెయిన్‌ రక్షణ, పునర్నిర్మాణంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఉక్రెయిన్‌కు మహిమ కలగాలి” అని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, గత శుక్రవారం రష్యా ఉక్రెయిన్‌పై భారీ వైమానిక దాడులు చేసినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. ఒకే రాత్రిలో 242 డ్రోన్లు, 13 బాలిస్టిక్ క్షిపణులు, 22 క్రూయిజ్ క్షిపణులను రష్యా ప్రయోగించిందని తెలిపారు. ఈ దాడుల్లో కనీసం నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని చెప్పారు.

సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన పోస్టులో, ఈ దాడుల ప్రధాన లక్ష్యంగా రాజధాని కీవ్‌తో పాటు ఇతర నగరాలు ఉన్నాయని పేర్కొన్నారు. తీవ్రమైన చలికాలంలో విద్యుత్ కేంద్రాలు, పౌర మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు చేయడం మరింత ఆందోళన కలిగిస్తోందని విమర్శించారు. తూర్పు యూరప్‌లో ఈ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతుండటం ప్రపంచ భద్రతకు ప్రమాదకర సంకేతమని అన్నారు.

కేవలం కీవ్‌లోనే 20 నివాస భవనాలు దెబ్బతిన్నాయని, నలుగురు మృతుల్లో ఒకరు అంబులెన్స్ సిబ్బంది సభ్యుడని జెలెన్స్కీ ధృవీకరించారు. ల్వివ్‌ ప్రాంతం సహా ఇతర ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సహాయక చర్యలు చేపడుతున్న సమయంలోనే మరోసారి నివాస భవనంపై దాడి జరగడం రష్యా క్రూరత్వానికి నిదర్శనమని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ మద్దతు మరింత బలంగా కొనసాగాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు.