Home Page SliderNationalNews Alert

యాక్సిడెంట్లో మరణించిన మహిళకు రూ.9 కోట్ల పరిహారం

ఏపీఎస్‌ఆర్టీసీకి భారీ షాక్ తగిలింది. బస్ యాక్సిడెంట్లో మరణించిన మహిళ కుటుంబానికి ఏకంగా రూ.9 కోట్ల పైనే నష్టపరిహారం చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. లక్ష్మి నాగళ్ల అనే మహిళ అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. 2009లో తన భర్త, ఇద్దరు కుమార్తెలతో అన్నవరం నుండి రాజమహేంద్రవరానికి వెళుతుండగా ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీనితో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆమె అమెరికాలో శాశ్వత నివాసిగా ఉందని, అక్కడ నెలకు 12 వేల డాలర్లు సంపాదించేదని ఆమె మరణానికి నష్టపరిహారంగా ఆర్టీసీ నుండి రూ.9 కోట్లు ఇప్పించాలని ఆమె భర్త సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. ఈ ట్రిబ్యునర్ రూ.8 కోట్లు చెల్లించాలని 2014లో ఆదేశించగా, ఈ తీర్పుపై తెలంగాణ హైకోర్టును ఆర్టీసీ ఆశ్రయించింది. హైకోర్టు రూ.5.75 కోట్లు చెల్లించాలని తీర్పునిచ్చింది. దీనిని సవాలు చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్లగా రూ.9,64,52,220 చెల్లించాలంటూ ఏపీఎస్‌ఆర్టీసీని ధర్మాసనం ఆదేశించింది.