500 కోట్లతో మెడికల్ కాలేజీ.. శంకుస్థాపన చేసిన సీఎం ..
జోగినాథునిపాలెంలో నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్.
నర్సీపట్నంలో రూ.986 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
రూ. 450 కోట్లతో ఏలూరు- తాండవ రిజర్వాయర్ కాలువల నిర్మాణం
నర్సీపట్నంలో ప్రధాన రహదారి అభివృద్ధికి మరో రూ.16 కోట్లు
రాష్ర్టంలో భారీగా చేపడుతున్న మెడికల్ కాలేజీల నిర్మాణంలో మరో మైలు పడింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని జోగినాథునిపాలెం వద్ద రూ. 500 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కాలేజీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా పరిధిలో నిర్మాణం అయ్యే ఈ మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే అన్ని అనుమతుల జారీ ప్రక్రియ పూర్తైనట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని జోగినాథునిపాలెం వద్ద మెడికల్ కాలేజీతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వీటిలో ఏలూరు – తాండవ రిజర్వాయిర్ ప్రాజెక్ట్ కు, రూ. 16 కోట్లతో చేపట్టనున్న నర్సిపట్నంలోని పలు రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ “ఈ రోజు మనం నర్సీపట్నం లో రూ.960 కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ ప్రారంభించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. గత టీడీపీ పాలనలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. స్థానికులకు మెరుగైన వైద్యం కావాలంటే వైజాగ్ కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇక ఆ పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశ్యంతో 52.15 ఎకరాలలో, రూ.500 కోట్ల ఖర్చుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నాం. ఇందులో 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. దీనికి అనుసంధానంగా నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇది ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో మేలు చేసే విషయం. దీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న అనకాపల్లి జిల్లా వాసుల కల నెరవేరినట్లు అవుతుంది” అని సీఎం జగన్ పేర్కొన్నారు.

రూ.450 కోట్లతో కాలువల నిర్మాణ పనులు
ఉత్తరాంధ్రలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలోనే నర్సీపట్నంలో ఒక మెడికల్ కాలేజీ, పార్వతీపురంలో ఒక మెడికల్ కాలేజీ, పాడేరులో మెడికల్ కాలేజీ, విజయనగరంలో మరో మెడికల్ కాలేజీలను సాధించి ప్రారంభించే పనులు చేస్తోందని ప్రజలు గర్వంగా చెప్పుకునే పరిస్థితి తెచ్చామని సీఎం జగన్ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలతో మీ ప్రాంతంలో వైద్య వసతులు లేవనే పరిస్థితులు ఇక ఉండవని పేర్కొన్నారు. వ్యవసాయం, రైతులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా గుర్తిస్తామని అందులో భాగంగా రిజర్వాయర్లు, ఆనకట్టల నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. అందుకోసం ఏలూరు – తాండవ రిజర్వాయిర్ల అనుసంధాన కాలువల నిర్మాణ పనుల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని తెలిపారు. కాలువల నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసినట్లు ప్రకటించారు. ఏలూరు – తాండవ ప్రాజెక్ట్ పూర్తి అయితే సుమారు 51 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తైనట్లు వివరించారు. ఏలేరు రిజర్వాయరును, తాండవ రిజర్వాయరును అనుసంధానం చేస్తున్న కాలువ అభివృద్ధికి, మరో 6 లిఫ్ట్లు ఏర్పాటు కలిసి దాదాపు రూ. 470 కోట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టులకు సంబందించి టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు, తుని మండలాలతో పాటు అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, నాతవరం, కోటవురట్ల మండలాలకు మేలు జరుగుతుంది. అంతే కాకుండా ఉత్తరాంధ్రలో సాగు నీటి వసతి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నర్సీపట్నంలో రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులు
నర్సీపట్నం మున్సిపాల్టీలో దాదాపు రూ.20 కోట్లతో ప్రధాన రహదారిని విస్తరించే పనులకు శంకుస్థాపన చేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. దీంతో పాటు నర్సీపట్నంలోని మున్సిపాలిటీ పరిధిలో సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. మెడికల్ కాలేజీ, భోధనాసుపత్రి, నర్సింగ్ కాలేజీ మరోవైపు పట్టణంలో ప్రధాన రహదారుల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలతో నర్సీపట్నం రూపురేఖలు మారుతాయన్నారు.