“ఆమె కుటుంబానికి రూ.25 లక్షల సహాయం”..అల్లు అర్జున్
‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. ఈ విషయంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆమె తన సినిమా చూడడానికి వచ్చి చనిపోవడం ఎంతో బాధ కలిగించిందని పేర్కొన్నారు. తన చిత్ర యూనిట్ అంతా షాక్‌కు గురయ్యిందని, తాను గత 20 ఏళ్లుగా ఇలాగే మొదటిరోజు అభిమానులతో కలిసి, తన సినిమాలు చూస్తున్నానని ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. ఆమెను తిరిగి తీసుకురాలేకపోయినా ఆమె కుటుంబానికి రూ.25 లక్షల సహాయం అందిస్తానని, ఆమె కుమారునికి చికిత్సఖర్చులు తానే భరిస్తానని మాట ఇచ్చారు. అంతకు ముందే ఈ దుర్ఘటన జరిగాక మృతురాలు రేవతి భర్త సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ థియేటర్ కి రావడం వల్లే తన భార్య చనిపోయిందన్నారు. అలాగే తన కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని రేవతి భర్త పేర్కొన్నారు. ఒకవేళ బన్నీ రాకపోయి ఉంటే అంత క్రౌడ్ ఉండేది కాదన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే మానవ హక్కుల కమిషన్‌కు ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్‌లపై కేసు నమోదు చేయాలని కోరారు.