ఆర్ అండ్ డి పెట్టుబడులకు రూ. లక్ష కోట్ల ఫండ్: మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడు దేశంలోని సైన్స్, టెక్నాలజీ రంగాలకు పెద్ద ఊతమిచ్చే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూ ఢిల్లీ లో నిర్వహించిన “ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025” ను ప్రారంభించిన సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగ ఆర్ అండ్ డీ పెట్టుబడులను పెంపొందించేందుకు రూ. లక్ష కోట్ల ప్రత్యేక ఫండ్ ను ప్రారంభించారు.
ఈ ఫండ్ ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్, రిన్యూవబుల్ ఎనర్జీ, స్పేస్ రీసెర్చ్ వంటి రంగాల్లో ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లు పరిశోధన-అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయవచ్చని ప్రధాని తెలిపారు. “భారత యువతలో ఉన్న ఆవిష్కరణాత్మక ఆలోచనలకు ఆర్థిక మద్దతు అందించడమే ఈ ఫండ్ లక్ష్యం,” అని ఆయన పేర్కొన్నారు. కొత్త స్టార్టప్ లకు నూతన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో దేశవ్యాప్తంగా స్టార్టప్ లు, ఇన్నోవేషన్ హబ్ లు, పరిశోధనా సంస్థలు మరింత చురుకుగా మారే అవకాశం ఉంది. టెక్ రంగంలో ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న భారత స్టార్టప్ ఎకోసిస్టమ్ కి ఇది మరొక బలమైన మద్దతుగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఎమర్జింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కాంక్లేవ్ 2025 ద్వారా భారత్ ను గ్లోబల్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ఫండ్ నిర్ణయాన్ని అనేక సంస్థలు స్వాగతించాయి. “ఆర్ అండ్ డీ పెట్టుబడుల పెంపు వల్ల దేశీయ ఉత్పత్తి నాణ్యత పెరగడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో భారత పరిశ్రమల పోటీ సామర్థ్యం కూడా మెరుగవుతుంది,” అని ఫిక్కీ, నాస్కామ్ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

