Home Page SliderNews AlertTelanganatelangana,

శ్రీశైలం టన్నెల్‌లో మరోసారి కూలిన పైకప్పు..కష్టంగా రెస్క్యూ ఆపరేషన్

శ్రీశైలం వద్ద ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్  ప్రమాదంలో టన్నెల్ వద్ద రెస్క్యూ చర్యలు మరింత కష్టంగా మారాయి. ఒకటో సొరంగం పైకప్పు మళ్లీ కూలడంతో పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే లోపల పేరుకున్న మట్టి, శిథిలాలు మరో మీటరు మేర పెరిగిపోయాయి. దీనితో బాధిత కుటుంబాలలో ఆందోళన అధికమవుతోంది.  ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూపొందించిన 44 కిలోమీటర్ల పొడవైన భూరీ సొరంగం నిర్మాణ దశలోనే విషాదం మిగిల్చింది. ఈ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు నాగర్ కర్నూల్ జిల్లా దోమల పెంట వద్ద 14 కిలోమీటర్ల వరకూ తవ్వకం పూర్తయ్యింది. దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత శనివారం ఉదయం మిగిలిన పనులు చేయడానికి సిద్ధమైన ఇంజినీర్లు, కార్మికులు 8 మంది సొరంగం పైకప్పు కూలడంతో లోపలే చిక్కుకుపోయారు. వారిని చేరుకునే మార్గం అంతా బురద, ఊరుతున్న నీటి వల్ల మూసుకుపోయింది. ప్రమాదం జరిగి మూడు రోజులు కావస్తుండడంతో గల్లంతైన వారి కుటుంబీకులు తీవ్ర ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టన్నెల్‌ వద్దకు చేరి పరిస్థితిని సమీక్షించనున్నారు.