దేశంలో సంపన్న సీఎం జగన్
భారతదేశంలోని సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. దేశంలో ప్రస్తుతం 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 28 రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు వీరు సీఎంలుగా కొనసాగుతున్నారు. మరో కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కాశ్మీర్ గవర్నర్ పాలనలో ఉన్నందున అక్కడ ముఖ్యమంత్రి లేరు. కాగా 30 మంది ముఖ్యమంత్రులలో 29 మంది కోటీశ్వరులే. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం ఇందుకు మినహాయింపు. ఆమె ఆస్తులు విలువ కేవలం 15 లక్షల మాత్రమేనట. సంపన్నుల సీఎంల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఆయా నేతలు సమర్పించిన అఫడవిట్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రుల ఆస్తులు వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్ విశ్లేషించింది. దీనిపై రూపొందించిన నివేదికను బుధవారం విడుదల చేసింది. దీని ప్రకారం 29 మంది సంపన్నుల సీఎంల సగటు ఆస్తుల విలువ 33.96 కోట్లని ఏడీఆర్ రిపోర్ట్ లో పేర్కొంది. అదే సమయంలో 30 మంది సీఎంలలో 13 మంది పై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. కొందరు ముఖ్యమంత్రులు హత్య ,హత్యాయత్నం కిడ్నాపింగ్ వంటి నేరాభియోగాలను ఎదుర్కొంటున్నారు. నాన్ బెయిలబుల్ పరిధిలోకి వచ్చే తీవ్ర నేరాల్లో దోషులుగా తేలితే వీరికి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
