అసభ్య చిత్రాలపై ఆర్జీవీ సంచలన ప్రకటన
“సినిమాలు ఇచ్చిన విజయం, అహంకారంతో నా కళ్లు నెత్తికెక్కాయి. నేను తాగుబోతును అయ్యాను. రెండు రోజుల ముందు నేను తీసిన ‘సత్య’ చిత్రం మరోసారి చూసేవరకూ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోయానని తెలుసుకోలేకపోయాను. ఇకపై అసభ్య, అశ్లీల చిత్రాలు తీయను. ‘సత్య’ చిత్రాన్ని చూసి, భావోద్వేగంతో కన్నీళ్లు వచ్చాయి. ఎన్నో విజయవంతమైన గొప్ప చిత్రాలు తీసిన నేను, ‘సత్య’ తర్వాత అతి తెలివితో అర్థం, పర్థం లేని అసభ్య సన్నివేశాలతో కూడిన సినిమాలు తీశాను. నా ప్రతిభకు సినీ ఇండస్ట్రీ, ప్రేక్షకులు ఇచ్చిన అవకాశాలు నిలబెట్టుకోలేకపోయాను”. అంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎమోషల్ పోస్ట్ పెట్టారు.
ఇకపై దర్శకునిగా తనకు గౌరవం కలిగించే సినిమాలే తీయాలని నిర్ణయించుకున్నానని, ‘సత్య’ చిత్రంపై ‘సత్య’ ప్రమాణం చేస్తున్నానని పేర్కొన్నారు. ఇకపై ఏ సినిమా మొదలుపెట్టినా, ‘సత్య’ సినిమాను ఒకసారి చూస్తానని పేర్కొన్నారు. ‘శివ, క్షణక్షణం, అంతం, రంగీలా, మనీ, సత్య’ వంటి ప్రయోగాత్మక చిత్రాలు తీసి, ప్రేక్షకులను మెప్పించిన రామ్ గోపాల్ వర్మ గత కొన్నేళ్లుగా అశ్లీల, అసభ్య కరమైన చిత్రాలు, రాజకీయ, హింసలతో కూడిన చిత్రాలు తీస్తూ ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు తానే స్వయంగా ఈ విషయం వెల్లడించడంతో ఆయన అభిమానులు ఆయనలో మార్పు వస్తోందని ఖుషీ అవుతున్నారు.

