మన్మోహన్‌కి రేవంత్ నివాళి
ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.ఒక ఆర్థిక వేత్తగా, ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కుటుంబీకులకు తన సానుభూతి ప్రకటించారు.


 
							 
							