‘హైదరాబాద్ ఊపిరి పీల్చుకో’…భారీ వర్షాల నుండి విముక్తి
హైదరాబాద్‌ను గత వారం రోజులుగా కుదిపేసిన భారీ వర్షాల నుండి నగర వాసులకు విముక్తి లభించింది. దీనితో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు హైదరాబాద్ వాసులు. తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలెర్ట్ కొనసాగుతున్నా, హైదరాబాద్‌కు మాత్రం గ్రీన్ అలర్ట్ లభించింది. తూర్పు, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు ఇంకా ఎల్లో అలెర్ట్ కొనసాగుతోంది. ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇవి మినహా మిగిలిన జిల్లాలకు తేలికపాటి వర్షాలు పడతాయని తెలియజేశారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న అల్పపీడనం బలహీనపడింది. ఇది ఇప్పుడు ఉపరితల ఆవర్తనంగా మారిందని తెలియజేశారు. ఇప్పటివరకూ ములుగు, జయశంకర్ భూపాల పల్లిలలో 65 సెంటీమీటర్ల వరకూ అత్యధిక వర్షపాతం నమోదు అయ్యిందని పేర్కొన్నారు.