NationalNews Alert

రిటైల్ రంగంలో రిలయెన్స్ దూకుడు

భారతదేశ వ్యాపారదిగ్గజం రిలయెన్స్ కంపెనీ, జియో పేరుతో టెలికాం రంగంలో ఇప్పటికే సునామీ సృష్టించింది. రిలయెన్స్ గ్రూప్ ఎన్నో రంగాలలో అడుగుపెట్టిన విషయం మనకు తెలుసు. ఇప్పుడు కొత్తగా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్(FMCG) విభాగంలోకి కూడా అడుగు పెట్టనుందని రిలయన్స్ మెగా ఈవెంట్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ ఒక కీలక ప్రకటన చేసారు. తన వ్యాపార బాద్యతలను తన వారసులకు అప్పగించారు.

జియో బాధ్యతలను ఆకాశ్ అంబానీకి, రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని ఇషా అంబానీకి, న్యూ ఎనర్జీ వ్యాపార బాధ్యతలను చిన్న కుమారుడు అనంత్ అంబానీకి అప్పగిస్తున్నట్లు తెలియజేసారు.

రిలయన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారం గత ఏడాది కాలంలో 9 రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. 2022 చివరికి ఎంజీ ఫీల్డ్, కేజీ -డీ6ను అమల్లోకి తీసుకురావడం వల్ల భారత గ్యాస్ ఉత్పత్తిలో రిలయన్స్ 30 శాతానికి చేరుకుంటుందన్నారు.

ONLINE గ్రాసరీ విభాగంలో రిలయన్స్ రిటైల్ దేశంలో నంబర్ 1గా నిలిచిందని ఇషా అంబానీ పేర్కొన్నారు. రోజుకు 6 లక్షల డెలివరీలు చేస్తున్నామని, 260 పట్టణాలలో జియోమార్ట్ సేవలు అందిస్తోందని తెలిపారు ఇషా. రిలయన్స్ రిటైల్ రాబోయే ఐదేళ్లలో 7500 పట్టణాలు, 3 లక్షల గ్రామాలకు సేవలందిచాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అంతేకాక గిరిజనులు, ఇతర అణగారిన వర్గాల వారు ఉత్పత్తి చేసే వస్తువుల మార్కెటింగ్‌ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

దీపావళి నుండి 5 జీ సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రముఖ నగరాలలో మొదలుపెట్టి ప్రతీనెలా ఈ సేవలను విస్తరించుకుంటూ వెళతామని, 2023 డిసెంబర్ నాటికి ప్రతి పట్టణం, గ్రామంలో తమ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఇందుకోసం మొత్తం 2 లక్షల కోట్లు కేటాయించామన్నారు. గత సంవత్సరంలో రిలయన్స్ రిటైల్ భారత్‌లోనే అత్యధిక ఉద్యోగాలు కల్పించిన సంస్థగా నిలిచిందని పేర్కొన్నారు.