జగనన్న వసతి దీవెన పథకం నిధులు విడుదల
రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులు, వారి తల్లులకు రూ.912.71 కోట్ల లబ్ధి
నా తమ్ముళ్లు, చెల్లెళ్లు సత్య నాదేళ్లతో పోటీ పడాలి
జగనన్న వసతి దీవెన
పథకం నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసారు. ఇచ్చిన మాట మేరకు సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా సీఎం వైయస్ జగన్ జగనన్న వసతి దీవెన
పథకం నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని అనంతపురం వేదికగా బటన్ నొక్కి జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతోంది. గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయడమేగాక 2017 నుంచి పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా వైయస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైయస్ జగన్ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్పల వేదికగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించి విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదును జమ చేశారు.
వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా వైయస్ జగన్ ప్రభుత్వం అందిస్తోంది. విద్యారంగంలో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్.. అధికారం చేపట్టిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై దేశంలోనే ఏ రాష్ట్రం ఖర్చు చెయ్యని విధంగా రూ.58,555.07 కోట్లను ఖర్చు చేశారు.
నన్ను చదివించేది జగనన్న
ఒక దీపం ఒక గదికి వెలుగు ఇస్తుంది. కానీ, చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగును నింపి ఆ కుటుంబాల రూపు రేఖల్ని మారుస్తుందని సీఎం జగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ.. విద్యార్థి దివ్య దీపిక మాట్లాడింది. అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ సెకండర్ ఇయర్ చదువుతోంది. ధర్మవరానికి చెందిన దివ్య దీపిక.. తండ్రి కొంగాల బాలకృష్ణ టైలర్, తల్లి గృహిణి. విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటోంది. వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ చెల్లించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారు. నా కుటుంబం మీద ఏ ఆర్థిక భారం పడకుండా.. నా అన్న జగనన్న చదవిస్తున్నాడంటూ భావోద్వేగానికి లోనైంది దీపిక.
సీఎం జగన్ మాట్లాడుతూ…
యువతను ప్రపంచ స్థాయి లీడర్లుగా తయారు చేయాలనేది మా లక్ష్యం. నా తమ్ముళ్లు, చెల్లెళ్లు సత్య నాదేళ్లతో పోటీ పడే పరిస్థితి రావాలి. ఆత్మవిశ్వాసం, కామన్‌సెన్స్‌తో పాటు మంచి డిగ్రీ ఉంటే మీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. నాలెడ్జ్ ఈజ్ పవర్..ఎడ్యుకేషన్ ఈజ్ పవర్ అని విద్యార్థులను ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు ఆ కుటుంబ సామాజిక వర్గాన్నే మారుస్తుంది. చదువు కులాల చరిత్ర మారుస్తుంది. చదువు ఒక్కటే పేదరికం నుంచి పేదరికం సంకెళ్లను తొలగించే అస్త్రమనీ ప్రతి ఒక్కరూ గమనించాలని సీఎం కోరారు. రాబోయే తరాలు ప్రపంచంతో పోటీపడి పేదరికం నుంచి బయటపడాలంటే కచ్చితంగా వాళ్ళందరూ కూడా గొప్పగా చదువుకోవాలని ఆ చదువు కోసం ఏ ఒక్కరు అప్పలపాలు అవ్వకూడదని అడుగులు ముందుకు వెస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. నాణ్యమైన చదువు ప్రతి ఒక్కరికి అందాలని గ్రామస్థాయి నుంచి విప్లవత్మక మార్పులను తీసుకొచ్చినట్టు ఈ సందర్భంగా గుర్తుచేశారు. జగనన్న విద్యాదీవెనకు తోడుగా జగనన్న వసతి దీవెన ఉంటే పిల్లలకు మంచి జరిగి పిల్లల తల్లిదండ్రులు అప్పులపాలు అవ్వకుండా ఉంటారని ఈ పథకం తీసుకొచ్చినట్టు తెలిపారు. కేవలం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పధకాలకే 14,223కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అరకొర ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మన ప్రభుత్వం 100శాతం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్లు పోటీపడేవి కానీ ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లతో ప్రైవేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు.
