Home Page SliderNational

రికార్డు స్థాయిలో పెండింగ్ కేసుల పుట్టలు

దేశవ్యాప్తంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోర్టులలో పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయి. సాక్షాత్తూ దేశ సుప్రీంకోర్టులో అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. 83 వేల పైచిలుకు కేసులు ఇప్పటి వరకూ పెండింగులో ఉన్నాయి. 2021లో 70 వేల కేసులు ఉండగా, పెరుగుతూ వచ్చి ఈ సంవత్సరం 83 వేలకు చేరుకున్నాయి. ఇక రాష్ట్ర హైకోర్టులలో పెండింగ్ కేసులు 59 లక్షలు ఉన్నాయి. 2023లో 61 లక్షలు ఉండగా, రెండు లక్షల కేసులు తగ్గాయి. గత పదేళ్లలో మొదటిసారిగా ఈ కేసులు తగ్గడం ఇదే మొదటిసారి. ఇక ట్రయల్ కోర్టుల సంగతి చెప్పనక్కరలేదు. 2014లో 2.6 కోట్లు పెండింగులో ఉంటే ప్రస్తుతం 4.5 కోట్లకు చేరుకున్నాయి. విచారించి, తీర్పునిచ్చే కేసు ఒకటి ఉంటే కొత్తగా వందల సంఖ్యలో కేసులు వస్తూనే ఉన్నాయి. 2009లో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య 26 ఉంటే 31కి పెంచారు. గత పదేళ్లలో 8 రెట్లు పెండింగ్ కేసులు పెరిగాయని రికార్డులలో ప్రకటించారు. దీనితో ప్రజలు ఈ దేశంలో సామాన్యునికి  న్యాయం అందని ద్రాక్షేనని అనేక విమర్శలు చేస్తున్నారు. కోర్టులకు సెలవులు ఎక్కువగా ఉండడం, వాయిదాలు ఇచ్చుకుంటూ పోవడం, లాయర్లు, జడ్జిలు గైర్హాజరు కావడం ఈ పెండింగ్ కేసులకు ముఖ్య కారణాలని విమర్శలు తలెత్తుతున్నాయి.