HealthHome Page SliderNationalNews Alert

ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు కారణాలివే

ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత ఆరోగ్య బీమా క్లెయింను తిరస్కరించడానికి మనం చేసే పొరపాట్లే కొన్ని కారణం కావచ్చు. లేదా బీమా నిబంధనలు కారణం కావొచ్చు. ఇలా బీమా కంపెనీ వద్ద అనేక కారణాలుంటాయి. సాధారణంగా బీమా క్లెయిం నిరాకరించడానికి ఈ కారణాలను చెప్పుకోవచ్చు.
. వైద్య చికిత్సకు ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా జాయిన్ అయినప్పుడు ఆ వివరాలను 24 గంటలలోపు బీమా సంస్థకు తెలియజేయాలి. ఈ సమాచారాన్ని మీ బీమా సంస్థకు కాల్ చేయడం ద్వారా లేదా కస్టమర్ సర్వీస్ హెల్ప్ డెస్క ఇ-మెయిల్ చేయడం ద్వారా కూడా తెలియజేయవచ్చు. ఏ కారణంచేతనైనా నిర్దేశిత వ్యవధిలోగా సమాచారం ఇవ్వడంలో విఫలం చెందితే మీ క్లెయిం తిరస్కరణకు గురయ్యే అవకాశముంటుంది.
. బీమా పాలసీ తీసుకున్న అనంతరం కొన్ని వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో పాలసీదారుడు కొన్ని అనారోగ్య పరిస్థితులకు క్లెయిం చేసే అవకాశముండదు. ఉదాహరణకు, కంటి శుక్లం, మూత్రనాళంలో రాళ్లు, మోకాళ్ల మార్పిడి మొదలైన రుగ్మతలకు వేచి ఉండాల్సి ఉంటుంది.
. బీమా సంస్థ..ఒక సంవత్సరంలో పాలసీదారుడు క్లెయిం చేసిన వైద్య ఖర్చులను పాలసీ సమ్ అష్యూర్డ్ ఆధారంగా చెల్లిస్తుంది. ఆసుపత్రి ఖర్చులు ఈ పరిమితి దాటితే క్లెయిం
తిరస్కరణకు గురికావచ్చు. అదనపు ఖర్చులను పాలసీదారుడే స్వయంగా భరించాలి.
. ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు..మీ ఆరోగ్య పరిస్థితులు, మునుపటి అనారోగ్యాలు, కుటుంబ వైద్య రికార్డులు, వ్యక్తిగత అలవాట్లు వంటి వివరాలను బహిర్గతం చేయడం చాలా ముఖ్యం. మీ వ్యక్తిగత, పాలసీ వివరాలు తప్పుగా ఉంటే, క్లెయింలను బీమా సంస్థ తిరస్కరిస్తుంది.
. ఆరోగ్య బీమా పాలసీ సాధారణంగా ఒక సంవత్సరం అమలులో ఉంటుంది. మరుసటి సంవత్సరం పాలసీ యాక్టివ్ గా ఉండి, క్లెయిం చేసుకోవాలనుకుంటే, గడువులోపు దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ గడువులోపు పునరుద్ధరించకపోతే పాలసీ రద్దవుతుంది. ఇలాంటి సమయంలో బీమా క్లెయిం చేస్తే తిరస్కరణకు గురవుతుంది.
. ఆరోగ్య బీమా పాలసీ పరిధిలో లేని చికిత్స ఖర్చులను క్లెయిం చేస్తే, అలాంటి వాటిని బీమా సంస్థ తిరస్కరిస్తుంది. ఉదాహరణకు, దంత సంరక్షణ, కాస్మెటిక్ సర్జరీలు, గర్భధారణ సంబంధిత సమస్యలు, కొన్ని కంటికి సంబంధించిన సమస్యలను బీమా సంస్థలు కవరేజ్ పరిధిలోకి తీసుకురావు. ఇలాంటి అనారోగ్యాలకు చెందిన వైద్య ఖర్చులను పాలసీదారులు క్లెయిం చేసినప్పుడు బీమా సంస్థలు తిరస్కరిస్తాయి.