నేడు చలో కర్నూలు రాయలసీమ గర్జన
◆ భారీ ఏర్పాట్లు చేసిన వైసీపీ
◆ 3 ప్రాంతాల ప్రజల మద్దతు కోసం ప్రాంతీయ సమావేశాలు
◆ టిడీపీకి కౌంటర్‌గా వైసీపీ కర్నూలులో రాయలసీమ గర్జన
ఏపీలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా అధికార వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దానిలో భాగంగా పరిపాలన అభివృద్ధి వికేంద్రీకరణ విధానాన్ని మూడు ప్రాంతాల ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వం ఆమేరకు మూడు ప్రాంతాల ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రాంతీయ సమావేశాలను నిర్వహిస్తుంది. అక్టోబర్ 15న నిర్వహించిన విశాఖ గర్జన విజయవంతమైన తర్వాత కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ కావాలని డిమాండ్ చేస్తూ సోమవారం చలో కర్నూలు రాయలసీమ గర్జనను అంతే స్థాయిలో నిర్వహించేందుకు అధికార వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. నవంబర్ మూడో వారంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలులో నిర్వహించిన సభ మంచి సక్సెస్ అవ్వటంతో దానికి కౌంటర్‌గా కర్నూల్‌లో వైసీపీ రాయలసీమ గర్జనను విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యింది.

కర్నూలు సభలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, మూడు రాజధానుల విధానంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో ఇది వైసీపీ నాయకులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ నేపథ్యంలోనే టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు రాయలసీమలో తమ బలాన్ని చాటేందుకు వైసీపీ ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు వైసీపీ నాన్ పొలిటికల్ జేఏసీ రాజకీయ పార్టీలు కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించింది. ఇందులో భాగంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపారు. వైసీపీ మద్దతుతో నాన్ పొలిటికల్ జేఏసీ సోమవారం నిర్వహించబోయే ఈ గర్జనను విజయవంతం చేసేందుకు ఇప్పటికే మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంజాద్ భాష, రోజా, ఆదిమూలపు సురేష్ లు పెద్ద ఎత్తున జన సమీకరణకు ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులతో నిత్యం సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. కర్నూలులోని ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో గర్జన ఏర్పాట్ల పర్యవేక్షణలో ఇప్పటికే మంత్రులందరూ నిమగ్నమయ్యారు.

రాయలసీమ ప్రజల హక్కులు అభివృద్ధి కోసం జరిగే ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలు సంస్థలను ఆహ్వానించినట్ల మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు శ్రీ బాగ్ ఒడంబడిక ప్రకారం హైకోర్టును కోరుతున్న రాయలసీమ ప్రజల ఆకాంక్షను తాము ఈ సభావేదికగా చూపిస్తామన్నారు. మూడు రాజధానుల విధానంలో వికేంద్రీకరణ అభివృద్ధికి మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ ప్రమేయంతో ప్రాంతీయ సమావేశాలు మొదటి గర్జన అక్టోబర్ 15న విశాఖపట్నంలో జరిగిందని అది భారీ విజయవంతమైన చెప్పారు. అలానే రాయలసీమ గర్జన పేరుతో అక్టోబర్ 29న తిరుపతిలో నిర్వహించిన గర్జన కూడా విజయవంతమైందని అదే స్ఫూర్తితో హైకోర్టు కోసం రాయలసీమ ప్రజల వాణిని ప్రతిధ్వనిస్తూ మూడో ప్రాంతీయ సమావేశం సోమవారం కర్నూల్లో జరగనుందని ఈ సభ కూడా కనివిని ఎరుగనిరీతిలో విజయవంతం కానుందని మంత్రి పేర్కొన్నారు. కర్నూల్ లో జరగబోయే ఈ గర్జనను వైఎస్ జగన్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆ స్థాయిలో విజయవంతం చేసే దిశగా మంత్రులు ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు.