రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి
ఇటీవల ఇండిగో విమానయాన సంస్థలో చోటుచేసుకున్న విమానాల రద్దు , ప్రయాణికుల తీవ్ర ఇబ్బందుల సంక్షోభం కారణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నాయకులు ఆయన అసమర్థతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కేంద్ర మంత్రిగా తన బాధ్యతలను నిర్వహించడంలోనే కాకుండా, సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయడంలో కూడా ఆయన ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వైఫల్యం వల్ల దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విమానాలు రద్దు అయ్యాయని విమర్శించారు. మంత్రి ముందస్తు సమన్వయం , సమీక్షలు చేయకపోవడం వల్లే ఇండిగో వంటి ప్రధాన ఎయిర్‌లైన్స్ కుప్పకూలిపోయాయని, ప్రజలు ఎయిర్‌పోర్టులలో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ సంక్షోభానికి నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్ల అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క ప్రతిష్ట దిగజారిపోయిందని, తన శాఖలోని పరిణామాలు అంచనా వేయకుండా నిర్ణయాలు తీసుకున్నందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని తమ్మినేని ఆరోపించారు. సమస్య వచ్చినప్పుడు మీడియాకు మొహం చాటు వేయకుండా, దేశ ప్రజలు ఎదురు చూస్తున్నందున మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆముదాలవలస నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ చింతాడ రవి కుమార్, రామ్మోహన్‌పై మరింత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అసమర్థత వల్లే సివిల్ ఏవియేషన్ ఘోర వైఫల్యం చెందిందని ఆయన ఆరోపించారు. రామ్మోహన్ నాయుడు తరచుగా కారెక్కేటప్పుడు, దిగేటప్పుడు రీల్స్ చేస్తూ ఉంటారని, అహ్మదాబాద్‌లో ఫ్లయిట్ కూలి 240 మంది చనిపోతే కూడా అక్కడికి వెళ్లి రీల్స్ చేస్తారని విమర్శిస్తూ, అందుకే ఆయనకు “రీల్స్ మంత్రి” అని పేరు వచ్చిందని ఎద్దేవా చేశారు. రీల్స్ పై పెట్టిన శ్రద్ధ తన శాఖపై పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఏవియేషన్ మినిస్టర్ చేతకానితనం కారణంగా దేశ పరువు ప్రపంచస్థాయిలో దిగజారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, కింజరాపు కుటుంబానికి రాజకీయంగా రాజయోగం కల్పించిన శ్రీకాకుళం ప్రజలకు మేలు చేసే ఒక్క ప్రాజెక్టును కూడా జిల్లాకు తీసుకురాలేకపోయారని, ఒక్క కేంద్ర సంస్థను కూడా తేలేకపోయారని, అందుకే జిల్లా ప్రజలు ఈ రోజు పశ్చాత్తాపపడుతున్నారని రవికుమార్ విమర్శించారు.

