“శిల్పం, వర్ణం, కృష్ణం, సెలబ్రేటింగ్ ది హెరిటేజ్”తో అదరగొట్టిన రామప్ప ఉత్సవాలు
తెలంగాణాకే తలమానికంగా పేరుపొందిన ప్రపంచ ప్రసిద్ధ పురాతన దేవాలయం రామప్పలో వైభవంగా వరల్డ్ హెరిటేజ్ వేడుకలు జరిగాయి. ఈ దేవాలయం 13వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటిది. ఈమధ్యనే యునెస్కోతో వరల్డ్ హెరిటేజ్ గుర్తింపును కూడా పొందింది. నిన్న( ఏప్రిల్ 18) ఇక్కడ ‘వరల్డ్ హెరిటేజ్ డే’ సందర్భంగా ‘శిల్పం, వర్ణం, కృష్ణం, సెలబ్రేటింగ్ ది హెరిటేజ్’ పేరుతో అత్యంత వైభవంగా ఉత్సవాలు జరిగాయి. దీనికి తెలంగాణా ప్రభుత్వ తరపున అతిథులుగా హాజరయ్యారు మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి. వీరు తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కిన సూపర్‌హిట్ మూవీ బలగం టీంను సత్కరించారు. ఈ ఉత్సవాలలో 300 మంది కళాకారులు పాల్గొని రకరకాల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. 80 మంది విద్వాంసులు ఒకేసారి ‘వయెలిన్’ వాయించారు. కాకతీయుల కాలంనాటి ‘పేరిణి నృత్యప్రదర్శన’ అందరినీ ఆకట్టుకుంది.

ప్రముఖ సంగీత దర్శకుడు ‘తమన్ మ్యూజికల్ నైట్’, ‘శివమణి డ్రమ్స్’తో ప్రేక్షకులు ఉర్రూతలూగారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన రామప్ప విశిష్టతలను వివరించే ‘లేజర్ షో’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ములుగు డీఆర్‌డిఏ అథ్వర్యంలో ‘ఫుడ్ ఫెస్టివల్స్’ ఏర్పాటు చేసి 30 స్టాల్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 10వేల మంది సందర్శకులు హాజరయ్యారు.



 
							 
							