ఆ టికెట్లపై రైల్వే శాఖ కీలక నిర్ణయం
భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రత కోసం రైళ్లలో కొన్ని కొత్త నిబంధనలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ముఖ్యంగా జనరల్ టికెట్ విషయంలో ప్రస్తుత నిబంధనలు సవరించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. రద్దీని నివారించడానికి, రద్దీ వల్ల కలిగే తొక్కిసలాటలు నివారించడానికి ఈ నిబంధనలు ఉపయోగపడతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగి 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా టికెట్ల విషయంలో స్పష్టమైన రైలు ప్రయాణం ఉండాలంటూ నిబంధన ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటివరకూ జనరల్ టికెట్ కేవలం ప్రయాణం మొదలుపెట్టే ప్రదేశం నుండి చేరే ఊరికి మాత్రమే ఇచ్చేవారు. రైలు పేరు దానిలో ఉండదు. దీనితో ప్రయాణికులు అదే దారిలో ప్రయాణించే ఏ రైలునైనా ఎక్కవచ్చు. కానీ ఈ కొత్త టికెట్ విధానంలో రైలు పేరును కూడా ప్రింట్ చేయాలని ప్రతిపాదిస్తున్నారు. దీనితో ప్రయాణికులు రైలును మార్చుకోలేరు. పైగా ఈ టికెట్ తీసుకున్న 3 గంటల వరకూ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఈ నిబంధనల వల్ల ప్రయాణికులు వారికి కేటాయించిన రైలులోనే కూర్చోవాలి. దీనితో రద్దీ తగ్గుతుందని, నిర్వహణ మెరుగవుతుందని భావిస్తున్నారు. ఈ విధానం త్వరలోనే అమలులోకి రాబోతోంది.

