బంగళాను ఖాళీ చేస్తా.. ఎన్నో మధురస్మృతులు ముడిపడి ఉన్నాయన్న రాహుల్..
మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో లోక్‌సభ సెక్రటేరియట్ ఆయన ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. తాజాగా పార్లమెంట్ సభ్యులకు కేటాయించే అధికారిక బంగాళాను ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 23లోగా ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. అయితే.. ఈ నోటీసుపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రభుత్వ నోటీసులకు కట్టుబడి ఉంటానన్న రాహుల్.. బంగళా ఖాళీ చేస్తానంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తాను ఇక్కడే గడిపానని తెలిపారు. ఈ భవనంతో ఎన్నో మధురస్మృతులు ముడిపడి ఉన్నాయన్నారు. వాటన్నిటికీ కారణం ప్రజలే అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ తొలిసారిగా 2004లో ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టారు. 2005 నుంచి తుగ్లక్ లేన్‌లోని బంగళాలో ఉంటున్నారు.