ఏపీలో రాహుల్ పాదయాత్ర.. ఓ రేంజ్లో రఘువీరా ఏర్పాట్లు!
◆ ఈనెల 14న అనంతపురం జిల్లాలోకి ప్రవేశం
◆ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ
◆ రాహుల్ పాదయాత్రకు మద్దతు మాజీ మంత్రి రఘువీరా మద్దతు
◆ మడకశిర నుండి వేలాదిమంది పాదయాత్రలో పాల్గొనేలా ప్రణాళికలు
◆ ఏపీలో పర్యటనలో రాహుల్ గాంధీ ఏం చెప్తారు?
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నిర్వహిస్తున్న భారత జోడోయాత్ర ఈనెల 14వ తేదీన ఆంధ్ర ప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. జోడోయాత్ర 37వ రోజున ఉమ్మడి అనంతపురం జిల్లాలోని డీ హీరాలాల్ మండలంలోకి ప్రవేశిస్తోంది. ఆ మండలంలో ఉదయం పూట బ్రేక్‌ను రాహుల్ గాంధీ మారెమ్మ టెంపుల్లో తీసుకోనున్నారు. ఆ తర్వాత ఓబులాపురంలో సాయంత్రం బ్రేక్ తీసుకుంటారు. ఆ ఒక్కరోజు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి అదే రోజు రాత్రికి బళ్లారిలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత ఆయన కర్ణాటకలో పర్యటన కొనసాగించి మళ్లీ 18న కర్నూలు జిల్లాలోని ఆలూరులో క్షేత్ర గుడి వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తారు. అప్పటినుండి 21వ తేదీ వరకు ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయంలో పర్యటనను కొనసాగిస్తారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి కర్ణాటకలోకి ప్రవేశిస్తారు. ఈ నెల 17వ తేదీన రాహుల్ గాంధీ తన యాత్రకు బ్రేక్ తీసుకొని బెంగుళూరు వెళ్లి ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొంటారు.

ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే సమయంలో చివరి రోజున రాహుల్ గాంధీ రెండు నిమిషాల పాటు కార్నర్ మీటింగుల్లో మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలైన ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ పై ఆయన మాట్లాడనున్నారు. ఈ యాత్రలో రాహుల్ తో పాటు పీసీసీ చీఫ్ శైలజానాథ్, రాష్ట్ర ఇన్చార్జి ఉమెన్ చాందీ, భారత్ జోడోయాత్ర ఇన్చార్జి దిగ్విజయ సింగ్ పాల్గొంటారు. వీరితో పాటు నాలుగు సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి పాదయాత్రలో పాల్గొంటారని సమాచారం. ఇప్పటికే ఆయన రాహుల్ గాంధీ పాదయాత్రకు మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ పాదయాత్ర ద్వారా ఆయన మడకశిర ప్రాంతం నుంచి వేలాది మందిని తీసుకురావడమే కాకుండా తన సొంత గ్రామమైన నీలకంఠాపురంలో నిర్మించిన దేవాలయాలలో ప్రత్యేక పూజలు చేయించుకొని ప్రసాదాలను రాహుల్ గాంధీకి అందించనున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీకి సంపూర్ణ మద్దతు తెలపాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.

రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా నిశ్శబ్దంగా ఉన్న రఘువీరారెడ్డి రాజకీయాల్లో రీ ఎంట్రిపై త్వరలో తన మనసులోని మాటను వెల్లడిస్తారని ఆయన అభిమానులు అనుచరులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రఘువీరారెడ్డిని టీడీపీ నేతలు తరచుగా కలవడం అలాగే అధికార పార్టీ నేతల కూడా తరచుగా కలవడంతో ఏదో ఒక పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర అనంతపురం జిల్లాలోకి అడుగుపెట్టనున్నడంతో రఘువీరారెడ్డి ఆయాత్రకు మద్దతు తెలపటంతో కొత్త హంగులతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ రూపు రేఖలు మారనున్నాయని ఆ జిల్లా ప్రజలు అనుకుంటున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రఘువీరారెడ్డి సగృహానికే పరిమితమయ్యారు. కేవలం నీలకంఠాపురంలో దేవాలయాలను నెలకొల్పే పనిలో పడ్డారు. రైతుగా మారి వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన అనుకున్న దేవాలయాల అభివృద్ధి పూర్తి దశ అయిపోయింది. దీంతో రఘువీరా మౌనం వీడి గ్రామ ప్రజలతో అనుచరులతో అభిమానులతో సమావేశమై… రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటానని రాజకీయాల గురించి సమయం వచ్చినప్పుడు విషయం వెల్లడిస్తానని కుండబద్దలు కొట్టారు. రాహుల్ పాదయాత్రతో మళ్లీ రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్న రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా, ఎన్నికల నాటికి వేరే పార్టీ తీర్థం పుచ్చుకుంటారా అనేది వేచి చూడాల్సి ఉంది.

