బీజేపీ కార్యకర్తలకు రాహుల్ ముద్దులు
భారత్ జోడో యాత్రతో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ కార్యకర్తలకు ముద్దులు పెట్టారు. రాజస్థాన్‌లోని ఝులావార్‌లో రాహుల్ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంపై ఆ పార్టీ కార్యకర్తలు నిలబడి రాహుల్ యాత్రను తిలకించారు. వాళ్లను గమనించిన కాంగ్రెస్ నేత కాషాయ శ్రేణులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇవ్వడం ఆసక్తి కలిగించింది. ఈ సమయంలో రాహుల్ గాంధీతో పాటు సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నాయకులు గోవింద్ సింగ్ దోటస్రా, సచిన్ పైలట్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను తీవ్రంగా విమర్శించిన మరుసటి రోజే ఆ పార్టీ కార్యకర్తలపై రాహుల్ గాంధీ ముద్దుల వర్షం కురిపించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ యాత్ర 12 రాష్ట్రాల గుండా సాగుతూ కశ్మీర్‌లో ముగుస్తుంది. ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్న రాహుల్ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు.

