Breaking Newshome page sliderHome Page SliderNationalNewsNews AlertPoliticsTrending Todayviral

బీజేపీపై తీవ్రంగా మండిపడ్డ రాహుల్ గాంధీ

ఒడిశా బాలేశ్వర్ లోని ఫకీర్ మోహన్ కాలేజీలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లెక్చరర్ వేధింపులు భరించలేక కాలేజీ ప్రాంగణంలో నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ… ఇది ఆత్మహత్య కాదని, బీజేపీ చేసిన వ్యవస్థీకృత హత్య అని అన్నారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. న్యాయం కోసం, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా బాధిత విద్యార్థిని ధైర్యంగా పోరాడిందని రాహుల్ అన్నారు. ఆమెకు న్యాయం చేయడానికి బదులు… అవమానించి, బెదిరించి, హింసించారని మండిపడ్డారు. నిందితుడిని కాపాడేందుకు బీజేపీ వ్యవస్థ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. ఒక అమాయకురాలైన విద్యార్థిని తనకు తానుగా నిప్పంటించుకునేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో కుమార్తెలు ప్రాణాలు కోల్పోతున్నా… మీరు ఇంకా మౌనంగానే ఉన్నారా? అని ప్రశ్నించారు. దేశానికి మీ మౌనం అవసరం లేదని… తమ ప్రశ్నలకు సమాధానాలు కావాలని అన్నారు. మహిళలకు భద్రత, న్యాయం కావాలని చెప్పారు. ఘటన వివరాల్లోకి వెళితే… బాధిత విద్యార్థినిని లెక్చరర్ సమీర్ సాహు కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడు. తనకు లొంగకపోతే భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించసాగాడు. ఆయన వేధింపులు భరించలేని బాధితురాలు గత నెల 30న కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన కాలేజీ యాజమాన్యం… ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో, తీవ్ర మనోవేదనకు గురైన బాధితురాలు 12వ తేదీన కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయానికి ఒక్కసారిగా పరిగెత్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తోటి విద్యార్థులు ఆమెను రక్షించే ప్రయత్నం చేశారు. బాధితురాలిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.