పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు
గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరు గురించి చేసిన వ్యాఖ్యలపై 2019 క్రిమినల్ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోర్టు దోషిగా నిర్ధారించింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 30 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. నిర్ణయంపై అప్పీల్ చేయడానికి అనుమతించింది. కేసు విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ సూరత్ రావడంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. గాంధీకి మద్దతును తెలియజేసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాలలో పార్టీ నేతలు సభలు, సమావేశాలు నిర్వహించారు. రాహుల్ గాంధీని ‘షేర్-ఎ-హిందుస్తాన్’ (హిందూస్థాన్ సింహం) అంటూ పోస్టర్లు వెలిశాయి. బీజేపీ నియంతృత్వృ పాలన ముందు కాంగ్రెస్ పార్టీ తలవంచదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

“దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరు ఎలా వచ్చింది?” అనే ఆరోపణలపై గాంధీపై కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోదీ ఫిర్యాదు చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో వయనాడ్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ మాట్లాడుతూ ఈ విధంగా ఆరోపణలు చేశారు. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ కోర్టు గత వారం ఇరుపక్షాల తుది వాదనలను ముగిశాక.. తుది తీర్పు వెల్లడించారు. “సత్యాన్ని పరీక్షిస్తారు, వేధిస్తారు, కానీ నిజం మాత్రమే గెలుస్తుంది. రాహుల్ గాంధీపై అనేక తప్పుడు కేసులు పెట్టారు, కానీ వీటన్నింటి నుండి బయటపడతాడు. మాకు న్యాయం జరుగుతుంది” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు ఎమ్మెల్యే అర్జున్ మోద్వాడియా అన్నారు.

కేసు విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి చివరిసారిగా అక్టోబర్ 2021లో ఈ కేసులో సూరత్ కోర్టుకు హాజరయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల ర్యాలీలో గాంధీ ప్రసంగిస్తూ, ‘దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భూపేంద్ర పటేల్ ప్రభుత్వ తొలి టర్మ్‌లో పూర్ణేష్ మోదీ మంత్రిగా వ్యవహరించారు. డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూరత్ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి మళ్లీ ఎన్నికయ్యారు. గాంధీ తరపు న్యాయవాది కోర్టు కార్యకలాపాలు మొదటి నుండి “లోపభూయిష్టంగా” ఉన్నాయని విమర్శించారు. గాంధీ ప్రసంగంలో ప్రధాన లక్ష్యం ప్రధాని అయినందున, ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉండాల్సింది ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ కాదని, ప్రధాని నరేంద్ర మోదీ అని రాహుల్ గాంధీ న్యాయవాది వాదించారు.

