ఏపిలో క్విడ్ ప్రోకో రూలింగ్
ఏపిలో కూటమి ప్రభుత్వం సమర్పించు క్విడ్ ప్రోకో రూలింగ్ చిత్రాలు నడుస్తున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులు,క్రియాశీలక కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. తమ ప్రభుత్వం కరోనాని సైతం తట్టుకుని సుపరిపాలన అందించిందని గుర్తు చేశారు. తాము పలావ్ పెడితే చంద్రబాబు బిర్యాని పెడతానని అబద్దం చెప్తే అంతా నమ్మి ఓట్లేసి మోసపోయారని,ఇప్పుడంతా జగన్ ఉంటే బాగుండేదంటూ మాట్లాడుకుంటున్నారని ,తాను సత్యవాక్య పరిపాలన చేశాను కాబట్టే ఇప్పుడు తన గురించి ఆలోచిస్తున్నారని జగన్ చెప్పారు.రాష్ట్రంలో నీకింత నాకింత అనే క్విడ్ ప్రోకో రూలింగ్ నడుస్తుందని విమర్శించారు.ఎమ్మెల్యేల నుంచి ముఖ్యమంత్రి వరకు నీకింత నాకింత అంటూ పంచుకుంటున్నారని చెప్పారు.ఇలాంటి దుష్టపాలన పోవాలంటే పార్టీ శ్రేణులు కొంత ఓపిక పట్టాలని ,నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.