నాణ్యత మన బ్రాండ్ కావాలి
అంతర్జాతీయ మార్కెట్లో భారత్ తన ముద్ర వేయాలంటే నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత బడ్జెట్ 2026-27పై జరిగిన రెండో వెబినార్‌ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రసంగించారు. “ఆర్థిక వృద్ధిని సుస్థిరం చేయడం – బలోపేతం చేయడం” అనే అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఆయన పారిశ్రామికవేత్తలకు దిశానిర్దేశం చేశారు. “నాణ్యత మన బ్రాండ్ కావాలి” అని పిలుపునిచ్చారు . వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను మనం పూర్తిస్థాయిలో అందుకోవాలంటే, మన ఉత్పత్తులు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండటమే కాకుండా, వాటిని మించిన నాణ్యతను కలిగి ఉండాలని ఆయన చెప్పారు.
భారత్ అంతర్జాతీయ వాణిజ్యంలో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోందని, పరిశోధన , అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మన పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పథంలో మనం ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయడమే కాకుండా, అంతర్జాతీయ అంచనాలను మించిన నాణ్యతను సాధించాలని పిలుపునిచ్చారు.
మన శక్తి సామర్థ్యాలను , తెలివితేటలను కేవలం ఒక్క అంశంపైనే కేంద్రీకరించాల్సి వస్తే, అది కచ్చితంగా ‘నాణ్యత’ మాత్రమే కావాలని ప్రధాని నొక్కి చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ తనదైన ముద్ర వేయాలంటే నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని హెచ్చరించారు. మన వస్తువులు కేవలం మేలైనవిగా ఉండటమే కాకుండా, ఇతర దేశాల ప్రజల అవసరాలను ,వారి అంచనాలను మించి ఉండాలని సూచించారు. ఇందుకోసం నిరంతరం అధ్యయనం చేస్తూ, మారుతున్న ప్రపంచ మార్కెట్ ధోరణులను అర్థం చేసుకోవడం అత్యవసరమని ఆయన వివరించారు.
విదేశీ వినియోగదారులకు అనువైన ఉత్పత్తులను సృష్టించినప్పుడే మనం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందుకోగలమని మోదీ పేర్కొన్నారు. “అభివృద్ధి అనే రహదారి మీ కోసం సిద్ధంగా ఉంది, దానిని ఉపయోగించుకోవాల్సింది మీరే” అంటూ పారిశ్రామిక రంగానికి దిశానిర్దేశం చేశారు. పరిశోధనలపై దృష్టి సారించి, అంతర్జాతీయ అంచనాలకు తగ్గట్టుగా నవకల్పనలు చేసినప్పుడే ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని బ్రాండ్‌గా మారుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

