Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsNews AlertTrending Todayviral

ఒకరిని జైల్లో పెట్టడం అంటే అతని పరువుతో ఆడుకోవడమే: జగన్

  • వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ
  • చంద్రబాబు పాలనలో అమాయకులపై తప్పుడు కేసులు
  • బాధితులకు వైసీపీ లీగల్ సెల్ అండగా ఉంటుంది
  • టీడీపీ వ్యతిరేకులైతే చాలు జైల్లో పెట్టి పరువు తీస్తున్నారు
  • బాధితులకు త్వరలో సరికొత్త యాప్

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధుల భేటీ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ‘ రాష్ట్రంలో ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. తప్పుడు కేసులతో అమాయకులను జైలుకు పంపుతున్నారు. ఒక మనిషిని జైల్లో పెట్టడం అంటే వారి పరువు, ప్రతిష్టలతో ఆడుకోవడం. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో నడిపిస్తున్నారు. ప్రలోభాలు పెట్టి, బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా కేవలం తప్పుడు వాంగ్మూలాలు తీసుకుని కుట్రలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొదటిసారి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. బాధితుల తరఫున న్యాయవాదులు నిలబడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయవాదులుగా మీ బాధ్యతలు మరింత పెరిగాయి. ఈ సేవలను పార్టీ ఎప్పుడూ మరిచిపోదు. మన ప్రభుత్వం హయాంలో మనం అనేక రకాలుగా న్యాయవాదులకు తోడుగా నిలిచాం. లా నేస్తం పేరిట న్యాయవాదులకు అండగా ఉన్నాం. న్యాయవాదులుగా మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీకి అన్నిరకాలుగా తోడుగా, పెద్దన్నగా మీరు ఉంటున్నారు. అడకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. కోరకపోతే దేవుడైనా వరం ఇవ్వడు. పిటిషన్ వేయకపోతే, మీరు వాదనలు వినిపించకపోతే న్యాయం కూడా దక్కదు. న్యాయవాదులుగా మీరు పోషిస్తున్న పాత్ర అభినందనీయం. చంద్రబాబు పాలనలో కలియుగ రాజకీయాలు చూస్తున్నాం. న్యాయం, ధర్మం ఎక్కడా కనిపించడం లేదు. తమకు వ్యతిరేకులని తెలిస్తే చాలు జైళ్లలో వేస్తున్నారు. నీచమైన సంస్కృతిని మనం చూస్తున్నాం. అట్టడుగు వర్గాలకు తోడుగా నిలుద్దాం. జగన్ 2.0లో మీ అందరికీ ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకోసం కష్టపడే వారికి తప్పకుండా వారికి ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకి పనిచేసే వారికి డేటాబేస్ పెడుతున్నాం. దీని ఆధారంగానే వీరికి గుర్తింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకోసం ఎవరు పనిచేస్తారో, వారికి ప్రాధాన్యత ఉంటుంది. మరి కొద్ది రోజుల్లో యాప్ కూడా విడుదల చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా.. ఆ యాప్ లో ఫిర్యాదు చేయవచ్చు. తన దగ్గరున్న ఆధారాలను, సాక్ష్యాలను యాప్ లో అప్ లోడ్ చేయవచ్చు. ఆటోమేటిక్ గా ఇవన్నీ డిజిటల్ లైబ్రరీలోకి వస్తాయి. అన్యాయాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టం ప్రకారం చర్యలు ఉంటాయి. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేయకపోయినా దెబ్బలు తింటున్న వ్యక్తికి ఎంత బాధ ఉంటుందో వారిని హింసించిన వ్యక్తికి కూడా అర్థం కావాలి”. అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.