Home Page SliderNational

అమృత్‌పాల్ కోసం పోలీసుల సెలవులు కూడా రద్దు చేసిన పంజాబ్

ఖలిస్తానీ నాయకుడు అమృత్‌పాల్‌ను ఎలాగైనా పట్టుకోవాలని పంజాబ్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అతడు చిక్కినట్టే చిక్కుతూ మాయమవుతున్నాడు. వేల మంది పోలీసులు ఒక్కడిని పట్టుకోలేక పోయారంటూ హైకోర్టు చీవాట్లు పెడుతోంది. ఈ ఒత్తిడంతా పోలీసుల సెలవులపై కూడా పడింది. ఏప్రిల్ 14 వరకూ వారికి సెలవులు ఇవ్వొద్దని, ఇచ్చిన సెలవులు కూడా రద్దు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. భైశాఖీ పండుగ రాబోతున్న కారణంగా ఏప్రిల్ 14న అమృత్‌పాల్ సిక్కులతో సమావేశం కావాలని భావిస్తున్నట్లు సమాచారం అందింది. అతడు అకాల్ తక్త్ చీఫ్‌ను సమావేశం ఏర్పాటు చేయమని అభ్యర్థించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. దీనితో అతడిని ఎలా అయినా పట్టుకోవాలని, పోలీసులు అందరికీ సెలవలు రద్దు చేయమని, ఆయా విభాగాధిపతులు కొత్త సెలవులు మంజూరు చేయవద్దని డీజీపీ ఆదేశాలు పంపారు.