Andhra PradeshBreaking NewsHome Page Sliderhome page sliderNewsPolitics

పులివెందుల ఎమ్మెల్యే Vs కుప్పం ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రతిపక్ష హోదా అంశం చుట్టూ వేడెక్కిన వాతావరణంలో గురువారం శాసనమండలిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత ఏడాది ఎన్నికల్లో కేవలం 11 సీట్లు గెలిచిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని ఈ సందర్భంలో అధికార పక్షం తరచూ వైఎస్ జగన్‌ను “పులివెందుల ఎమ్మెల్యే” అంటూ ఎగతాళి చేస్తూ వస్తోంది.
కానీ ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ నేతలు గురువారం గట్టి సమాధానం ఇచ్చారు. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబును “కుప్పం ఎమ్మెల్యే” అని సంబోధించడంతో కూటమి శ్రేణుల్లో దుమారం రేగింది.

రమేష్‌ వ్యాఖ్యలపై టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలు ఒకేసారి లేచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రులు కొల్లు రవీంద్ర, డోలా బాలవీరాంజనేయ స్వామి మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. “జగన్‌ను పులివెందుల పులకేశి అని పిలిస్తే ఒప్పుకుంటారా?” అంటూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అయితే వైసీపీ మాత్రం వెనక్కి తగ్గలేదు. “జగన్‌ను పులివెందుల ఎమ్మెల్యే” అని పదేపదే చెప్పే అధికార పక్షానికి, అదే తరహా బాణం వదిలామని వైసీపీ సభ్యులు వాదించారు.

ఈ పరిణామం ద్వారా వైసీపీ స్పష్టమైన సంకేతం ఇచ్చింది. జగన్‌ కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైన నాయకుడు కాదు, మాజీ ముఖ్యమంత్రి, కోట్లాది మంది మద్దతుదారులు ఉన్న రాష్ట్రస్థాయి నేత అని మరోసారి బలంగా వినిపించింది.
అధికార పక్షం ఎంత ఎగతాళి చేసినా, జగన్ స్థాయిని తగ్గించలేరని వైసీపీ కౌంటర్ స్పష్టం చేసింది. దీని ఫలితంగా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.

మండలిలో చెలరేగిన ఈ వివాదంపై మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు స్పందిస్తూ, వ్యాఖ్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.