బాక్టీరియా, వైరస్‌ల నుండి చర్మాన్ని ఇలా కాపాడుకోండి
మన శరీరానికి చర్మం ఇచ్చే రక్షణ అంతా,ఇంతా కాదు. శరీర లోపలి భాగాలలోని సున్నిత అవయవాలకు తొడుగులా, గొడుగులా ఉండడమే కాదు, మనల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. చర్మం కాలిపోయినా, చర్మవ్యాధులు వచ్చినా వారు అందవికారంగా కనిపిస్తారు. అందుకే అందమైన,ఆరోగ్యవంతమైన చర్మం శరీరానికి పెట్టనికోటగా ఉంటుంది. చర్మంలోని నాడుల వల్లే మనం వేడి, చల్లదనం, మృదుత్వం వంటి స్పర్శను ఆస్వాదించగలుగుతున్నాము. జ్ఞానేంద్రియాలలో అతి పెద్ద అవయవంగా ఉంది చర్మం. ఈ చర్మానికి ఎన్నో సమస్యలు వస్తూంటాయి. బాక్టీరియాలు, వైరస్‌లు దాడులు చేస్తూంటాయి. చర్మం మీద అనేక సూక్ష్మక్రిములు నివసిస్తూంటాయి. వీటిలో హాని చేసేవి కూడా ఉంటాయి. హాని కారకాలను తగ్గిస్తూ, మేలు చేసే బాక్టీరియాలను పెంటే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.

చర్మం పొడిబారకుండా తగినంత నీరు, ద్రవపదార్థాలు తీసుకోవాలి. ఎక్కువసేపు ఎండ, పొడి వాతావరణాలలో గడిపితే చర్మం పొడిబారే అవకాశం ఉంది. కఠినమైన సబ్బులతో స్నానం చేయకూడదు. మరీ వేడి నీటి స్నానాలు చేయకుండా, గోరువెచ్చని నీటిని వాడాలి. చేతులకు ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్లు, లోషన్లు రాసుకోవాలి. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలకు చర్మం ప్రభావితం కాకుండా చూసుకోవాలి. దీని వల్ల చర్మం కమిలిపోయి, చిన్న వయసులోనే ముడతలు పడే ప్రమాదం ఉంది. ఎండ తీక్షణంగా ఉన్నప్పుడు సరైన రక్షణ లేకుండా ఎండలో బయటకు వెళ్లకూడదు.

