స్మితా సబర్వాల్ కు ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లాస్..
కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చేసిన రీట్వీట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఏఐ జనరేటెడ్ ఫోటోను స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఈ రీట్వీట్ కారణంగా గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్మితా సబర్వాల్ స్పందిస్తూ.. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరించానని తెలిపారు. అలాగే.. తాను రీట్వీట్ చేసినట్లే మరో 2000 మంది కూడా చేశారని వారందరిపై కూడా చర్యలు తీసుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా..? లేక కొందరిని మాత్రమే ఎంపిక చేసి టార్గెట్ చేస్తున్నారా..? అని ఆమె నిలదీశారు. ఈ వివాదం ప్రస్తుతం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సివిల్ సర్వీసెస్ లో ఉండి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ స్మితా సబర్వాల్ తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారిణిగా ఉండి ప్రభుత్వాన్ని నిందించే పోస్టులు పెట్టటం సరికాదని అన్నారు. దాన్ని కన్నా రాజకీయాల్లో చేరితే సరిపోతుంది కదా అని చురకలు అంటించారు.

