Home Page SliderNational

ఇకపై క్షణాల్లోనే ఈ- ఓటరు గుర్తింపు కార్డు

Share with

దేశంలోని 5 రాష్ట్రాలకు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ- ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. కాగా దీనికోసం వెబ్‌సైట్‌లో కొన్ని కీలక మార్పులు చేసింది. ఈ విధానంలో మొబైల్ నంబర్ నమోదు చేయడంతోనే ఈ-గుర్తింపు కార్డును పొందవచ్చు. కాగా ఈ ఓటరు గుర్తింపు కార్డు తమ ఓటు హక్కును వినియోగించేందుకు చెల్లుబాటు అవుతుందని  కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఓటరు జాబితాలో మార్పులు,చేర్పుల కోసం రూపొందించిన ఫాం-8నే దీనికి ఉపయోగించాల్సి ఉంటుంది.

కాగా ఈ దరఖాస్తులో మొబైల్ నెంబర్ నమోదు చేసేందుకు ప్రత్యేక కాలమ్ అందుబాటులో ఉంటుంది. ఆ కాలమ్‌పై క్లిక్ చేసి మొబైల్ నంబర్ నమోదు చేసిన తరువాత ఫామ్‌ను సబ్‌మిట్ చేయాలి. ఆ తర్వాత https://voters.eci.gov.inలో e-epic విభాగంలోకి వెళ్లి కేటాయించిన ప్రాంతంలో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలి. దీంతో వెంటనే నమోదు చేసిన మొబైల్ నంబర్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే ఈ-ఓటర్ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది. కాగా ఈ విధంగా పొందిన ఈ-ఓటర్ కార్డ్ అన్ని సర్టిఫికెట్ల మాదిరిగానే చెల్లుబాటు అవుతుంది. దీంతో ఈ ఈ-ఓటరు కార్డ్‌ కలిగిన వారు ఎన్నికల సంఘం పంపే ఓటరు కార్డ్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. అయితే ఈ సదుపాయం గత ఎన్నికల నుంచే అందుబాటులో ఉన్నప్పటికీ అది ఆమోదం పొందేందుకు ఎక్కువ సమయం పట్టేది. కాగా నమోదు చేసిన వివరాలు సంబంధిత అసెంబ్లీ నియోజక వర్గ ఎన్నికల అధికారి ఆమోదించిన తర్వాత ఆ ప్రక్తియ పూర్తయ్యేది. దీంతో ఈ-ఓటరు కార్డ్ పొందేందుకు అధిక సమయం పట్టేది. అయితే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది.