ఈడీ విచారణకు హాజరైన ప్రియాంక గాంధీ భర్త
ప్రముఖ వ్యాపార వేత్త, వయనాడ్ ఎంపీ ప్రియాంకా గాంధీభర్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. భార్య ప్రియాంకా గాంధీతో కలిసి ఈడీ కార్యాలయానికి వెళ్లారు.యూకేకు చెందిన ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారీ కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడానికే ఈడీ సమన్లు జారీ చేసింది. వాస్తవానికి జూన్ 10నే రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ 56 ఏళ్ల వాద్రా తనకు జూన్ 9న ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నాయని, ప్రోటోకాల్ ప్రకారం కొవిడ్ టెస్ట్ చేయించుకున్నానని చెప్పి గైర్హాజరు అయ్యారు. దీంతో ఆయనకు ఈడీ మరోసారి సమన్లు పంపింది. జూన్ 17న తమ ముందు హాజరు కావాలని రాబర్ట్ వాద్రాను ఈడీ కోరింది. అయితే, అప్పుడు కూడా ఈడీ సమన్లను రాబర్ట్ వాద్రా దాటవేశారు. ఇప్పుడు తాజాగా విచారణకు హాజరయ్యారు. మరోవైపు హర్యానాలో 2008 భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈడీ పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

