శంషాబాద్‌లో దారుణ హత్యకు పాల్పడ్డ పూజారి నిర్వాకం
శంషాబాద్ పరిధిలో అప్సర అనే యువతిని దారుణంగా హత్య చేసి, మ్యాన్‌హోల్‌లో పడేసి పోయాడు ఒక పూజారి. భగవంతునికి అర్చన చేసే చేతులతోని పైశాచికంగా హత్యకు పాల్పడ్డాడు సరూర్ నగర్‌కు చెందిన సాయికృష్ణ అనే పూజారి. తన బంధువుల అమ్మాయే అయిన అప్సరను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. అప్పటికే వివాహమై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్న అతనిని వివాహం చేసుకోమంటూ అప్సర ఒత్తిడి చేసిందని, ఆమెను బండరాతితో మోది, హత్య చేశాడు సాయికృష్ణ. వీరిద్దరూ మూడు రోజుల క్రితం కారులో శంషాబాద్‌లోని సుల్తాన్ పల్లికి వెళ్లారు. పెళ్లి విషయంలో గొడవ పడి ఆమెను హత్య చేసి, అనంతరం కారులోనే సరూర్ నగర్‌కు వచ్చాడు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఆమె మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో పడేశాడు. అనంతరం అమాయకుడిలా నటిస్తూ తన బంధువు అప్సర కనిపించడం లేదని, పోలీసు కంప్లైంట్ ఇచ్చాడు.

అతని తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు సాయికృష్ణ సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీకెమెరా దృశ్యాల ఆధారంగా అప్సరను అతడే హత్య చేసినట్లు తేల్చారు. మృతదేహం కోసం మ్యాన్‌హోల్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. తన కుమార్తె అతనిని ప్రేమించలేదని, తనకు అన్ని విషయాలు చెప్తుందని, ఆమె తల్లి అనుమానం వ్యక్తం చేసింది. అప్సర తండ్రి కాశీలో ఉంటారని, తమకు ప్రతినెలా పంపించే డబ్బుతో తాము జీవిస్తుంటామని పేర్కొన్నారు ఆమె తల్లి. సాయికృష్ణ పూజారి, దైవభక్తుడు కావడంతో అతనిని అనుమానించలేదని ఆమె చెప్పారు. అతడు వచ్చి, అప్సరను భద్రాచలం పంపినట్లు తెలిపారని తెలియజేశారు.

