మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల..?
మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. టీఆర్‌ఎస్ మాత్రం ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. మంగళవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ మునుగోడుపై కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు హాజరయ్యారు.

బీసీ అభ్యర్థిపైనా ఆలోచన..
నియోజక వర్గంలో మండలాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు, వన భోజన కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆ సమ్మేళనాల్లోనే మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల పేరును ప్రతిపాదించి పార్టీ కార్యకర్తల అభిప్రాయం తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. మరోవైపు నియోజకవర్గంలో బీసీ జనాభా ఎక్కువగా ఉంది. దీంతో కార్యకర్తలు బీసీ అభ్యర్థిని కోరుకుంటున్నారా.. అనే విషయాన్ని ఆత్మీయ సమ్మేళనాల్లోనే తేల్చాలని ఆదేశించారు.

ప్రచారాన్ని వేగవంతం చేయాల్సిందే..
కాంగ్రెస్, బీజేపీ.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ప్రకటించడంతో తాము కూడా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటిస్తే లాభమెంత.. నష్టమెంత.. అనే విషయాలను కేసీఆర్ కూలంకుశంగా పరిశీలిస్తున్నారు. కార్యకర్తలు బీసీ అభ్యర్థిని కోరుకుంటే ఆ సామాజిక వర్గంలో బలమైన నాయకుడి కోసం వెతకాలని జిల్లా పార్టీ నాయకులను ఆదేశించినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికైతే కూసుకుంట్ల అభ్యర్థిత్వం వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా టీఆర్‌ఎస్ అభ్యర్థిని త్వరలో ప్రకటించి ప్రచారాన్ని వేగవంతం చేయాలని కేసీఆర్ తుది నిర్ణయానికి వచ్చారు.