Home Page SliderNational

కోర్టులపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్‌లో కోర్టులపై, న్యాయవ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులలో న్యాయం జరగడం లేదని, సున్నితత్వం లేదనే అభిప్రాయాలకు ప్రజలు వస్తున్నారని పేర్కొన్నారు. న్యాయం జాప్యం కావడం, సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న కేసులు ప్రజలకు సవాలుగా మారాయన్నారు. రెండు రోజుల జిల్లా న్యాయవ్యవస్థల జాతీయ సదస్సు సందర్భంగా ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కోర్టులలో వాయిదాల పర్వాలను ప్రోత్సహించవద్దని, తీర్పులలో వేగం పెంచాలని న్యాయాధికారులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు. తీవ్రమైన నేరాలు, రేప్‌ల వంటి కేసులలో జాప్యం కారణంగా కోర్టుల పట్ల సామాన్యులు అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు. అత్యవసరమైన కేసులను త్వరగా పరిష్కరించేందుకు లోక్ అదాలత్‌లను నిర్వహించాలని సూచించారు. గ్రామాలలో పేదలు కోర్టుకు వెళ్లాలంటే భయపడుతున్నారని తెలిపారు. మానసికంగా, ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతున్నారని, కొన్ని కేసుల్లో నిందితులు స్వేచ్ఛగా తిరగడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారని పేర్కొన్నారు.