Home Page SliderNational

కర్నాటక అసెంబ్లీకి హోరాహోరీగా పోలింగ్

కర్నాటక అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ హోరా హోరీగా సాగుతోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ, తిరిగి విజయం సాధించాలని కాంగ్రెస్, కింగ్ మేకర్ పాత్రలోకి ఒదిగిపోవాలని జేడీఎస్ భావిస్తోంది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప శివమొగ్గలో ఓటు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 75%-80% మంది ఓటర్లు బీజేపీకి మద్దతిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. “మేము సంపూర్ణ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 130-135 సీట్లు గెలుస్తాం” అని యడ్యూరప్ప చెప్పారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ తమ పార్టీ ప్రచారాన్ని నిర్వహించిన తీరు, ప్రజలు స్పందించిన తీరు చాలా సంతోషం కలిగిస్తుందన్నారు. “కర్నాటక అభివృద్ధి కోసం ప్రజలు వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అన్నారు బొమ్మై. ప్రగతిశీల ప్రభుత్వం కోసం, 40 పర్సెంట్ కమిషన్ లేకుండా ఉండటం కోసం, కర్నాటకను తిరిగి పునర్నిర్మించడం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్లకు పిలుపునిచ్చారు.

“కర్ణాటక ఓటు… 5 హామీల కోసం, మహిళల హక్కుల కోసం, యువత ఉపాధి కోసం, పేదల అభ్యున్నతి కోసం. పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు వేయండి” అని రాహుల్ అన్నారు. కర్నాటకలో విజయం కోసం రెండు పార్టీలు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాయి. ప్రధాని నరేంద్ర మోదీ 19 బహిరంగ సభలు, ఆరు రోడ్‌షోలు నిర్వహించగా, రాహుల్‌ గాంధీ 12 రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ముందు, BJP పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలను మూటగట్టుకొంది. లింగాయత్, వక్కలిగలకు ముస్లింలకు కేటాయించిన 4 శాతం కోటాను సర్దుబాటు చేసి బీజేపీ సరికొత్త రాజకీయం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో ‘ఇతర వెనుకబడిన కులాల’ 2B కేటగిరీలో ముస్లింలకు దశాబ్దాలుగా ఉన్న నాలుగు శాతం కోటాను రద్దు చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రవేశాలు, నియామకాలలో వక్కలిగలు, లింగాయత్‌లకు పెరిగిన కోటా ప్రయోజనాలను అందిస్తామంది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సుప్రీంకోర్టు తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని నిలిపివేసింది. ప్రస్తుతానికి ముస్లిం రిజర్వేషన్లను కొనసాగించాలని ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణ జూలైలో జరగనుంది. బీజేపీకి చెందిన పలువురు సీనియర్ లింగాయత్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ సహా పలువురికి పార్టీ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో, ఆ వర్గం ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాల్సి ఉంది. 90 నుంచి 100 సీట్లపై లింగాయత్ ఓట్లు ప్రభావం చూపించే అవకాశం ఉంది.

జనతాదళ్ సెక్యులర్ చీఫ్ హెచ్‌డి కుమారస్వామితో కలిసి గతంలో అధికారంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈ సారి ఆ అవసరం రాదని దీమాతో ఉంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్ మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ఎన్నికల్లో గెలుపు కోసం ఇద్దరు నేతలు చేయాల్సి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ల పంపిణీలోనూ పెద్దగా చికాకులు లేకుండా ఖర్గే మధ్యవర్తిత్వం వహించారు. హెచ్‌డి కుమారస్వామికి చెందిన జనతాదళ్ సెక్యులర్‌కు, ఇది కీలకమైన ఎన్నిక. 90వ దశకంలో ఉన్న పార్టీ స్థాపకుడు హెచ్‌డి దేవెగౌడ, రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు. హాసన్, మాండ్య దాటి తన స్థావరాన్ని విస్తరించుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ ఇప్పుడు పాత మైసూరు ప్రాంతంలో తన సంప్రదాయ ఓటు బ్యాంక్‌ను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.