Andhra PradeshHome Page Slider

యాత్రల పేరుతో జోరు పెంచిన రాజకీయ పార్టీలు

Share with

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మండే ఎండల కంటే అత్యంత వాడి వేడిగా సాగుతున్నాయి. మండుతున్న ఎండల్ని సైతం లెక్క చేయక రాజకీయ పార్టీలు వివిధ యాత్రల పేరుతో ప్రజల్లో చొచ్చుకు వెళ్లేందుకు ముందుకు కదులుతున్నాయి.అధికార పార్టీ ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సంక్షేమ ఫలాల అందని వారికి సైతం సురక్ష పథకం ద్వారా ఫలాలను అందజేసి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా వేడి పుట్టించి మెజారిటీ కాపు వర్గం ఉన్న ఉమ్మడి గోదావరి జిల్లాలో కాపులను రెండు వర్గాలుగా చీలిపోయేంతగా రాజకీయాలు చేస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా వారాహి వాహనం పై నుండి ప్రసంగించడంతోపాటు పలు వర్గాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించటం వివిధ సమస్యలపై స్పందించటానికి ప్రాధాన్యమిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై మంత్రులు ఎమ్మెల్యేలు విమర్శలకు దిగటంతో రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులు అధికార పార్టీపై విరుచుకుపడుతున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ తాజాగా ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో భవిష్యత్తుకు భరోసా పేరుతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల్లోకి అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు ఈనెల 20వ తేదీ నుండి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళంపేరుతో పాదయాత్ర చేస్తూ వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక భారతీయ జనతా పార్టీ అగ్ర నేతలు రాష్ట్రంలో పర్యటించిన సందర్భంగా అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు గుప్పించటం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరతీసింది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయా అనే దానిపై ఇప్పటికే ప్రజల్లో విస్తృత చర్చ నడుస్తోంది. రాజకీయ పరిశీలకులు మాత్రం భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాజకీయాలను తమ వైపు తిప్పుకునే క్రమంలో ఎత్తుగడలో భాగంగానే అధికార పార్టీపై విమర్శలు గుప్పించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మొత్తం మీద అన్ని పార్టీలు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఎవరి అజెండాతో వారు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో పరస్పరం ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ విమర్శలు సంధించుకుంటున్నారు. ఎన్నికల నాటికి రాజకీయ వేడి మరింత పెరగనుంది.