Home Page SliderNational

రాజకీయ శిఖరం, పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత

ఐదుసార్లు పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన అకాలీదళ్‌ అధినేత ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ మంగళవారం మొహాలీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో మరణించారు. ఆయన వయసు 95. 1957లో కాంగ్రెస్‌వాదిగా 30 ఏళ్ల వయసులో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు, గ్రామ సర్పంచ్‌గా పనిచేసి, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రకాష్ సింగ్ బాదల్ పంజాబ్‌లోని అబుల్ ఖురానాలో రాజస్థాన్ సరిహద్దుకు సమీపంలో జన్మించారు. లాహోర్‌లోని ఫోర్మాన్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా 43 ఏళ్లకే ప్రకాష్ సింగ్ బాదల్ నిలిచారు.

ఏడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో, కేవలం రెండు ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారు. 1967లో, 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. అత్యాధునిక వైద్యం అందించినప్పటికీ ప్రకాష్ సింగ్ బాదల్ అనారోగ్యంతో మరణించారని, ఫోర్టిస్ హాస్పిటల్ మొహాలీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ నాయకుడు రాత్రి 8 గంటలకు మరణించినట్లు ఆసుపత్రి డైరెక్టర్ అభిజీత్ సింగ్ పిటిఐకి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి శ్వాస తీసుకోవడంలో అసౌకర్యంగా ఉండటంతో వారం రోజుల క్రితం మొహాలీలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు.

జూన్ 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో మిలిటెంట్లను ఏరివేయడానికి సైన్యం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించినప్పుడు బాదల్ అరెస్ట్ అయ్యారు. 2020లో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనతో ఆ పార్టీ బీజేపీతో బంధాన్ని తెంచుకుంది. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా 2015లో ప్రభుత్వం నుండి అందుకున్న దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అవార్డును ప్రకాష్ సింగ్ బాదల్ తిరిగి ఇచ్చేశారు. పొరుగున ఉన్న హర్యానాతో నది నీటిని పంచుకోవడానికి ఉద్దేశించిన సట్లెజ్ యమునా లింక్ (SYL) కాలువ ఆలోచనను అకాలీదళ్ నాయకుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఐతే, బాదల్ నాయకత్వంలో, రాష్ట్ర అసెంబ్లీ వివాదాస్పద పంజాబ్ సట్లెజ్ యమునా లింక్ కెనాల్, యాజమాన్య హక్కుల బదిలీ బిల్లు 2016ను ఆమోదించింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ నాయకుడికి నివాళులర్పించారు, “భారత రాజకీయాలలో ఒక గొప్ప వ్యక్తి మరియు గొప్ప రాజనీతిజ్ఞుడు” అని పేర్కొన్నారు. బాదల్ మరణం ఎంతో బాధ కలిగించిందన్నారు. ఆయన భారత రాజకీయాల్లో ఒక గొప్ప వ్యక్తి, గొప్ప రాజనీతిజ్ఞుడని కొనియాడారు. పంజాబ్ పురోగతి కోసం అవిశ్రాంతంగా పనిచేశారని, క్లిష్టమైన సమయాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని అన్నారు. బాదల్ మృతి వ్యక్తిగతంగా తనకు ఎంతో నష్టమన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.

బాదల్ కుటుంబానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సిద్ధాంతాలలో విభేదించినప్పటికీ, అతను అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినందున, పంజాబ్ ప్రజలలో అపారమైన గౌరవాన్ని పొందారని అన్నారు.

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్‌ మాజీ అధ్యక్షుడు సర్దార్‌ ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ మరణవార్త విచారకరమన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పంజాబ్ రాజకీయాలతోపాటు, దేశ రాజకీయాల్లో ఆయన చరిత్ర సృష్టించారన్నారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో సహా అతని కుటుంబ సభ్యులు, మద్దతుదారులందరికీ సానుభూతిని తెలిపారు.