Home Page SliderNational

కేరళ బిషప్‌లతో ప్రధాని భేటీ – ఆసక్తికర పరిణామాలు

దేశంలోని క్రైస్తవులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న సహాయం వెలకట్టలేనదని కేరళలోని అత్యంత ప్రభావవంతమైన పాస్టర్‌లలో ఒకరైన సిరో-మలబార్ చర్చి ఆర్చ్ బిషప్ కార్డినల్ జార్జ్ అలెంచెర్రీ ప్రశంసలు కురిపించారు. కేరళ ప్రజలు ప్రధాని మోదీని మెచ్చుకుంటున్నారని, అభివృద్ధి కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ, కేరళ పర్యటన సందర్భంగా, వివిధ క్రైస్తవ వర్గాలకు చెందిన ఏడుగురు బిషప్‌లతో సమావేశమయ్యారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు చేపడతున్న కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులుపై వారు హర్షం వ్యక్తం చేశారు. కేరళకు చేస్తున్న సహకారాన్ని అభినందిస్తూనే, మరింతగా కేరళకు కేంద్రం దన్నుగా నిలవాలని కోరారు. తిరువనంతపురం నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించడంపై వారు ఆనందం వక్తం చేశారు.

కేరళలో క్రైస్తవులు 18 శాతం మంది ఉన్నారు. గత కొన్నాళ్లుగా కేరళలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బీజేపీ ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఫలితం లభించడం లేదు. దీంతో మెజార్టీ జనాభా అయిన క్రైస్తవులను చేరుకునేందుకు పార్టీ కార్యక్రమాలు చేపడుతోంది. క్రిస్టియన్ జనాభా, యువతను ప్రో-యాక్టివ్‌గా చేరుకోవడం ద్వారా, 2024 జాతీయ ఎన్నికల్లో పార్టీకి ఊపు వస్తోందని బీజేపీ భావిస్తోంది. క్రైస్తవులకు ఆందోళన కలిగించే అనేక విషయాలు ప్రధాని మోదీతో చర్చించినట్టు సైరో-మలబార్ చర్చి ఆర్చ్‌బిషప్ కార్డినల్ జార్జ్ అలెంచెర్రీ పేర్కొన్నారు. ఉత్తర భారతదేశంలో కొందరు మత ఛాందసవాదులు మిషన్ పనులకు ఆటంకాలు కలిగిస్తున్నారని చెప్పగా మోదీ, అడ్డంకులను తొలగిస్తామని భరోసా ఇచ్చారని ఆయన చెప్పారు. అన్ని విషయాలను ప్రధానమంత్రి శ్రద్ధగా విన్నారని, దేశ ప్రజలందరికీ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తెలిపారు. అగ్రవర్ణాల పేదలకు కేంద్రం అందించిన 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన విషయాన్ని పాస్టర్లకు మోదీ వివరించారు.

కేరళ ప్రజలు ప్రధాని మోడీని అభినందిస్తున్నారని… మరింత అభివృద్ధిని కోరుకుంటున్నట్టు సైరో మలబార్ ఆర్చ్ బిషప్ వెల్లడించారు. గత కొద్ది రోజులుగా కేరళలో బీజేపీ నేతలు మతపెద్దలు, క్రైస్తవ సంఘాల నేతలతో వారి ఇళ్లలో సమావేశమవుతున్నారు. గోవా, ఈశాన్య ప్రాంతాలలో బీజేపీ విజయం తర్వాత కేరళపై పట్టు సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈశాన్య, గోవాల మాదిరిగానే కేరళలో కూడా ప్రజలు బీజేపీని ఎన్నుకుంటారని ప్రధాని తన ప్రసంగంలో సూచనప్రాయంగా పేర్కొన్నారు. ఇప్పుడు పార్టీని అందరినీ కలుపుకొని అభివృద్ధిని అందించే పార్టీగా చూడాలని మోదీ అన్నారు. కేరళలోని క్రిస్టియన్ కమ్యూనిటీ ఇప్పటికే ప్రతిస్పందిస్తున్నట్లు కనిపిస్తోంది, పలువురు ప్రముఖ పాస్టర్లు బీజేపీకి సానుకూల ప్రకటనలు చేస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో, మలంకర ఆర్థోడాక్స్ సిరియన్ చర్చి బిషప్ మాట్లాడుతూ, భారతదేశంలో క్రైస్తవ సమాజం, కేంద్రం తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్న అభిప్రాయం తప్పని, అంతర్జాతీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
రబ్బర్ ధరలకు బీజేపీ మద్దతు ఇస్తే కేరళలో కమలం పార్టీ ఎంపీకి ఓటు వేయవచ్చని తలస్సేరిలోని ఒక బిషప్ చెప్పారు.