ఎన్నికలయ్యాక జగనే టీడీపీలో చేరతారంటున్న పిఠాపురం వర్మ
రాష్ట్రంలో ఉచితంగా పబ్లిసిటీ లభిస్తున్న కొందరు నాయకుల్లో పిఠాపురం టీడీపీ నేత వర్మ ఒకరు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని చెప్పిన నాటి నుంచి ఆయన వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తొలుత తాను ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని, కార్యకర్తలతో రచ్చ చేసి ఆయన సంచలనమయ్యారు. ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ తర్వాత మెత్తబడ్డారు. తాను పవన్ కల్యాణ్‌ను పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిపించి తీరాతానంటూ శపథం చేశారు. అయితే ఆయన ఏం చేస్తారోనన్న బెంగ అటు టీడీపీలోనూ, ఇటు జనసేనలోనూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తనపై కావాలని కొందరు పార్టీ మారతానంటూ ప్రచారం చేస్తున్నారని, అందుకే ఏకంగా సీఎం జగన్ పై ఆయన ఫోకస్ పెట్టారు.

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఏపీలో అటు వైసీపీ అటు టీడీపీ కూటమి గిల్లిగజ్జాలకు అంతే లేకుండా పోతోంది. ముఖ్యంగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ బరిలో దిగడంతో అక్కడ వాతావరణంపై రాజకీయంగా రచ్చ సాగుతోంది. ఈ ఎన్నికల్లో జనసేనాని గెలిపించుకునే బాధ్యత నెత్తికెత్తున్న వర్మ, ఈసారి ఏం చేస్తారోనన్న ఆందోళన ఉంది. అయితే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు స్పష్టతనిస్తున్నాయ్. తాను వైసీపీలో చేరబోతున్నానంటూ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన, ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ సమక్షంలో జగన్.. టీడీపీలో చేరతారంటూ కొత్త వర్షన్ విన్పించారు.

మొత్తం పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తారన్న ప్రచారాన్ని జనసైనికులు అందుకుంటే, గెలిచేది గీతేనంటూ అక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. ఈ తరుణంలో నిన్నటి వరకు గీత జనసేనలో చేరుతారన్న ప్రచారమూ జరిగింది. గతంలో పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత అందుకు ఆమె కౌంటర్ కూడా ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిని అలా ప్రశ్నిస్తారా.. తాను కూడా పవన్ కల్యాణ్ పార్టీ మారతారా అని అడుగగలనంటూ ఆమె కౌంటర్ ఇచ్చారు.

తాజాగా అందరి చూపు వర్మవైపు పడుతోంది. ఎన్నికల్లో చాన్నాళ్లూ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు ఏం చేస్తారోనన్న వర్షన్ ప్రచారంలో ఉంది. అసలే వర్మ, ఆపై రాజకీయం ఎలా ఉంటుందో ఇక వేరే చెప్పనక్కర్లేదు. తాను చంద్రబాబు మనిషినని, 2014 నుంచి వైసీపీలోకి ఆహ్వానిస్తున్నప్పటికీ తాను టీడీపీలోనే తాజాగా ఆయన చెప్పుకొచ్చారు. పిఠాపురంలో ఓడిపోతామనే అక్కసుతో తనపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తానన్నారు.